పవన్ చంద్రబాబుకు భయపడ్డారా?

Update: 2017-03-19 06:19 GMT
వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నానని చెబుతున్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మళ్లీ చంద్రబాబు కోసం గళమెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఆయన ఆ సమయంలో  టీడీపీకి ఓటేయమని కోరుతూ..  టీడీపీ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రజల తరపున చంద్రబాబును తాను ప్రశ్నిస్తానని అప్పట్లో చెప్పారు.  అయితే ఈ మూడేళ్లలో చంద్రబాబును తప్ప పవన్ కల్యాణ్‌ మిగిలిన అందరినీ ప్రశ్నిస్తున్నారు. తాజాగా చంద్రబాబు కోసం ఆయన తనను చంద్రబాబుకు దగ్గర చేసిన ప్రధాని మోడీనే ప్రశ్నించారు. రైతు రుణమాఫీల విషయంలో మోడీ తీరును ట్విట్టర్‌ లో ప్రశ్నించారు.
    
ఉత్తరప్రదేశ్‌ లో రుణమాఫీ అమలు చేస్తామని బీజేపీ ప్రకటించడంతో పవన్ తీవ్రంగా ప్రశ్నించారు కేంద్రప్రభుత్వాన్ని. రైతు రుణమాఫీ కేవలం ఉత్తరాధి రాష్ట్రాలకేనా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రుణమాఫి ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. అయితే... పవన్ ఆవేశంగా ప్రశ్నించాడే కానీ ఆలోచించి ఎవరిని ప్రశ్నించాలన్నది తెలుసుకోలేకపోయాడు.  
    
ఏపీ, తెలంగాణలో రుణమాఫి హామీ ఇచ్చింది చంద్రబాబు,కేసీఆర్‌లు. ఆ హామీ ఇచ్చి కూడా మూడేళ్లు గడిచిపోయింది. చంద్రబాబును నమ్మిన రైతులు ఇప్పుడు బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేని దుస్థితి. అయితే ఈ మూడేళ్లలో ఏనాడు కూడా రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబును పవన్‌ ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ కు మాఫీ అనగానే స్పందించిన పవన్… ముందు చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన విధంగా ఎందుకు రుణమాఫీ చేయలేదని నిలదీయాల్సింది. కేంద్రంలో టీడిపి భాగస్వామిగా ఉంటున్నా, ఏపీ విషయంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా… కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని చంద్రబాబును పవన్ ప్రస్నిస్తే బాగుంటుంది. బీజేపీ చేస్తున్న దగాకు నిరసనగా చంద్రబాబు కేంద్రం ప్రభుత్వం నుంచి బయటకు వస్తారో? లేక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారో? అని బాబును నిలదీస్తే అప్పుడు జనం కూడా పవన్ ని నమ్ముతారు.
    
కాగా పవన్ సడన్ గా చంద్రబాబుకు మద్దతుగా మోడీని ప్రశ్నించడానికి కారణం ఉందంటున్నారు. రెండు రోజుల కిందట చంద్రబాబు పవన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో పవన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని... ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో.. ఎంత ప్రయోజనం కలిగిందో చెప్పాలని పవన్ కు చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ ఎందుకో వెనక్కు తగ్గారని... చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News