జ‌నాలను భ‌య పెట్టి గెలుచుడేంది.. మోడీ సారూ!

కాంగ్రెస్ వ‌స్తే.. ఆస్తులు దోచేసుకుంటుంద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

Update: 2024-04-30 12:50 GMT

ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే నాయ‌కులు ఉన్నారు. పార్టీ విధానాల‌ను వివ‌రించి త‌మ గెలుపును సునాయాసం చేసుకునే పార్టీలు ఉన్నాయి. కానీ, ఎటొచ్చీ.. ఎక్క‌డ‌కు వ‌స్తే.. అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌య పెట్టి గెలుపు గుర్రం ఎక్కాల‌నే చెండాల‌పు ఆలోచ‌న దిశ‌గా ప్ర‌ధాని మోడీ స్థాయి నాయ‌కుడు ప్ర‌య‌త్నించ‌డం ఇప్పుడు ఎబ్బెట్టుగా ఉంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అనికాదు.. ఎక్కడికెళ్లినా.. అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టే విధంగా మోడీ ప్ర‌సంగాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ వ‌స్తే.. ఆస్తులు దోచేసుకుంటుంద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

అంతేకాదు.. మ‌హిళ‌ల మంగ‌ళ‌సూత్రాలు కూడా లాగేసుకుని మైనారిటీల‌కు దోచిపెడుతుంద‌ని.. ఈ దేశంలో ప్ర‌జ‌లు బ‌త‌క‌లే ర‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌ధాని మోడీ చెబుతున్నారు. కానీ, ప్ర‌జాస్వామ్య దేశంలో ఇది సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌. పైగా కాంగ్రెస్ పార్టీనే మేనిఫెస్టోలో ఇలా రాసింద‌ని కూడా అభూత‌క‌ల్ప‌న‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఇది మ‌రీ విడ్డూరంగా ఉంది. మేనిఫెస్టోలో ఎక్క‌డా కూడా కాంగ్రెస్ ఇలా .. దేశ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటామ‌ని చెప్ప‌లేదు. పైగా..తాము అధికారంలోకి వ‌స్తే.. ఏటా రూ.ల‌క్ష చొప్పున పంచుతామ‌ని చెబుతోంది. ఎలా చూసుకున్నా. ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగాల్లో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి గెల‌వాల‌నేది క‌నిపిస్తోంది.

Read more!

తెలంగాణ‌లో..

తాజాగా తెలంగాణలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ ఇక్క‌డ మ‌రో చిత్ర‌మైన విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చారు. అదే`డ‌బుల్ ఆర్‌` ట్యాక్స్‌. (డ‌బుల్ అంటే.. రేవంత్ రెడ్డి) ఆయ‌న పేరు చెప్ప‌కుండా డ‌బుల్ ఆర్ అంటూ.. ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం డ‌బుల్ ఆర్ ట్యాక్స్‌లు ప్ర‌జ‌ల పై రుద్దు తోంద‌ని.. వారి ఆస్తులు కూడా మిగ‌ల‌బోవ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కేంద్రంలో రేపే కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. డ‌బుల్ ఆర్ ట్యాక్స్ అక్కడ కూడా రుద్దు తార‌ని.. దీంతో ప్ర‌జ‌లు పేద‌లు అవుతార‌ని .. రోడ్ల‌మీద‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని మోడీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అందుకే బీజేపీకి ఓటేయాల‌ని.. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గెలిపించాల‌ని మోడీ పిలుపునిచ్చారు. కానీ, మోడీ వంటి పెద్ద నాయ‌కుడు ఇలా ప్ర‌జ‌ల‌ను భ‌య పెట్టి.. అధికారంలోకి రావాల‌ని అనుకోవ‌డ‌మే ఇప్పుడు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఇలా భ‌య పెట్ట‌డంతోనే త‌న ప్ర‌సంగాన్ని పూర్తి చేశారు. అయితే.. ప్ర‌జ‌లు ఏమీ అమాయ‌కులు కాద‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలియంది కాదు. ఎవ‌రు వ‌స్తే.. ఏం జ‌రుగుతుందో వారికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. సో.. మోడీ త‌న ప్ర‌సంగాల్లో ఈ భ‌యోత్పాతం క‌లిగించే భావ‌న‌ను త‌గ్గించుకుంటే.. ఆయ‌న ఇమేజ్ బాగుంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News