బంగారం అమ్మి.. ఇల్లు కొంటే పన్నుండదు.. ఎలాగో తెలుసా?

అదెలాగంటే.. వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను అమ్మితే పొందిన లాభాలపై పన్ను మినహాయింపునకు అనుమతిస్తూ ఇటీవల 'ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ITAT)' బెంగళూరు బెంచ్‌ తీర్పు చెప్పింది.

Update: 2024-04-30 15:30 GMT

సొంత ఇల్లు.. మధ్య తరగతి వారికి ఓ పెద్ద కల.. సగటు ఉద్యోగికి ఓ ఆత్మ గౌరవం.. సమాజంలో ఎక్కువగా ఈ వర్గాల వారే ఇల్లు కొనుక్కోవాలని చూసేది. ఎందుకంటే.. వీరికి ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ.. వారసత్వంగా వచ్చే ఆస్తులూ తక్కువే.. పైగా కుటుంబంలో ఎవరికైనా పెద్దలకు అనారోగ్యం ఉంటే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ శాతం ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడిచే వర్గాలు ఇవి. ఇక పేదలు అంటారా? వీరికి ఏ ప్రభుత్వాలో పథకాలు ప్రకటిస్తాయి. సంపన్నులకు అసలు ఆ దిగులే ఉండదు కదా... మరి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన ప్రజలు, ఉద్యోగులు సొంతిల్లు ఒకేసారి డబ్బు పెట్టి కొనగలరా? అంటే కష్టమే. మరి ఇల్లు కొన్నాక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం సహజం. వీటిని తట్టుకునే శక్తి వారికి తక్కువే అని చెప్పాలి. ఇలాంటి వారి సొంతింటి కల నెరవేరుతూనే.. ఆర్థికంగా భారం తప్పేలా ఓ ఉపశమన మార్గం కూడా ఉంది. అదేంటో తెలుసుకోండి.

మీకు వారసత్వంగా బంగారం వచ్చిందా..?

సహజంగా భారతీయులు బంగారాన్ని అలంకరణతో పాటు భవిష్యత్ ఆస్తిగానూ చూస్తారు. ఆడ పిల్లలకు అయితే వివాహ సందర్భంగా ఇచ్చేందుకు పనికొస్తుందని భావిస్తారు. ఇలాంటి వారసత్వంగా వచ్చిన బంగారం.. ఇల్లు కొనే సమయంలో ప్రయోజనం చేకూర్చుతుందని తేలింది. అదెలాగంటే.. వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను అమ్మితే పొందిన లాభాలపై పన్ను మినహాయింపునకు అనుమతిస్తూ ఇటీవల 'ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ITAT)' బెంగళూరు బెంచ్‌ తీర్పు చెప్పింది. సెక్షన్‌ 54ఎఫ్‌ (Section 54F) కింద ఓ వ్యక్తి చేసుకున్న క్లెయిమ్‌ ను ఐటీ సమీక్షాధికారి తిరస్కరించారు. అయితే, దీనిపై ఐటీఏటీ విచారణ జరిపి తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఏమున్నదంటే.. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకు వాడితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మినహాయింపు ఉంటుంది. అంతేగాక.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చిన మొత్తంగా పరిగణించడానికి వీల్లేదని తేల్చింది. పూర్వీకుల నుంచి వచ్చిన దీర్ఘకాల మూలధన ఆస్తిగానే చూడాలని పేర్కొంది. కాగా, ఇన్ కం ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం.. దీర్ఘకాల మూలధన ఆస్తులను అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇల్లు కొనడానికి ఉపయోగిస్తే దానిపై వచ్చే లాభానికి ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇక్కడ మూలధన ఆస్తులు అంటే.. షేర్లు, బాండ్లు, ఆభరణాలు, బంగార. అయితే, ఇంటిని మాత్రం మూలధన ఆస్తిగా లెక్కించరు.

Read more!

సెక్షన్‌ 54ఎఫ్‌ కింద వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు మినహాయింపు కోరవచ్చు. అలాగే ఆస్తులు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని కచ్చితంగా ఇంటి కొనుగోలుకే వినియోగించాలి. పన్ను చెల్లింపుదారుడి పేరిట.. ఆ సమయానికి కొత్త ఇల్లు మినహా మరొకటి ఉండొద్దు.

రూ.10 కోట్లకే మినహాయింపు కొత్తగా కొన్న ఆస్తి విలువ.. బంగారం అమ్మగా వచ్చిన దానికంటే ఎక్కువ లేదా సమానమైతే.. మొత్తం ఆదాయంపై మినహాయింపు వస్తుంది. ఒకవేళ కొన్న ఇంటి విలువ అమ్మిన బంగారం కంటే తక్కువైతే.. మిగిలిన మొత్తంపై పన్ను చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం.. గరిష్ఠంగా రూ.10 కోట్లపై మాత్రమే మినహాయింపు ఉంటుంది. వారసత్వంగా వచ్చే బంగారాన్ని అమ్మాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్‌ చేసుకోవాలి. పన్ను భారం ఉండొద్దనుకుంటే ఇల్లు కొనడమో, కట్టడమో చేయాలి. బంగారం అమ్మిన వెంటనే ఒక్కోసారి ఇల్లు దొరకదు. అలాంటప్పుడు ఐటీఆర్‌ గడువు సమీపిస్తే తప్పకుండా వచ్చిన ఆదాయాన్ని దాంట్లో చూపించి పన్ను చెల్లించాల్సిందే. దీన్నుంచి మినహాయింపు కోసం తాత్కాలిక వెసులుబాటు ఉంది. అదే క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌. వచ్చిన మొత్తాన్ని దీంట్లో డిపాజిట్‌ చేయడం వల్ల ఆ సంవత్సరానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, సంబంధిత పత్రాలు పక్కాగా ఉండాలి. మీ బంగారాన్ని కొంటున్నవారిని కూడా దీనిపై అప్రమత్తం చేయాలి.

Tags:    

Similar News