అద్భుతాలు జ‌రుగుతాయంటూ..ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌నం

Update: 2019-11-19 07:52 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2017 డిసెంబర్‌ లో రాజకీయ అరంగేట్రం చేసినా పార్టీ స్థాపనపై రజనీకాంత్‌ ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నార‌నే అప‌ప్ర‌ద‌ను ఎదుర్కుంటున్న ఆయ‌న‌పై ఇటీవల బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఊహాగానాలను రజనీ ఖండించారు. ఇలాంటి త‌రుణంలో...కమల్ హాసన్ సినిమా 60 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రజనీ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  సీఎం అవుతారని పళనిస్వామి కలలో కూడా ఊహించి ఉండరని అన్నారు. నాలుగైదు నెలలు కూడా ఆ పదవిలో ఉండరని తమిళనాడు మొత్తం అనుకుందని కానీ రెండేళ్లుగా అద్భుతాలు - అతిశయాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరుగుతాయంటూ కామెంట్‌ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. తన గురించి తాను చేసుకున్నవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు మారు పేరైన త‌మిళ‌నాడులో జయలలిత - కరుణానిధి కన్నుమూసిన తరువాత సినీ నేప‌థ్యం ఉన్న‌ కమల్‌ హాసన్ - రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేశారు. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించిన క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన ఓట్లను సాధించి ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టి 2021లో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మ‌రోవైపు 2017లోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ పెట్టడంపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే, అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతను తాను భర్తీ చేస్తానని రజనీకాంత్‌ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. రజనీ - కమల్‌ ఇద్దరూ సీఎం కుర్చీపై కన్నేసి ఉన్నారని తేటతెల్లమైంది.

మ‌రోవైపు - జయలలిత హఠాన్మరణం వల్ల అన్నాడీఎంకేలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. జయలలిత హయాంలో చక్రం తిప్పిన శశికళ జైలు పాలయ్యారు. పెద్దగా గుర్తింపులేని ఎడపాడి పళనిస్వామి అకస్మాత్తుగా సీఎం అయ్యారు. ఎడపాడి ప్రభుత్వం రోజుల్లోనో నెలల్లోనో కూలిపోగలదని అందరూ ఆంచనావేయగా సుస్థిరమైన ప్రభుత్వంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. ఇదే విష‌యాన్ని పేర్కొంటూ... ``సీఎం అయ్యేందుకు ఏళ్లతరబడి కలలు కనక్కరలేదు.. సీఎం కావాలని ఏనాడైనా ఎడపాడి కలలు కన్నారా - అలాగే రేపు ఎవరైనా సీఎం కావచ్చు `` అని ర‌జ‌నీ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

రాబోయే రోజుల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలూ చోటుచేసుకుంటాయని కలకలం రేపే కామెంట్ల వెనుక అర్థం ర‌జ‌నీ త‌న గురించి తాను ప్ర‌క‌టించుకోవ‌డ‌మా?  లేక‌పోతే...ప‌ళ‌నిస్వామి వ‌లే తాను కూడా సీఎం కాగలననేదే రజనీకాంత్‌ మాటల్లోని మర్మమా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

   

Tags:    

Similar News