గాంధీ ఫ్యామిలీపై చిదంబరం మాట పర్సనల్

Update: 2015-11-30 09:39 GMT
‘గాంధీ’ కుటుంబానికి వీర విధేయుడైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం తెలిసిందే. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఇరుకున పడిన కాంగ్రెస్.. ఇప్పుడు అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నాల్ని షురూ చేసింది. అత్యయిక పరిస్థితిని విధించి ఇందిరాగాంధీ తప్పు చేస్తే.. ప్రముఖ రచయితీ సల్మాన్ రష్దీ రాసిన శటానిక్ వర్సస్ పుస్తకాన్ని బ్యాన్ చేయటం ద్వారా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తప్పు చేశారంటూ ఒక సదస్సులో చిదంబరం వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

దీంతో.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. సమాధానం చెప్పాల్సి వచ్చింది. దీంతో.. తమకు అత్యంత విధేయుడైన చిదంబరం మాటకు కాంగ్రెస్ కు సంబంధం లేదని చెబుతూ.. ఈ ఇష్యూ నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. చిదంబరం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని.. వాటితో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. చిదంబరం చేసిన ప్రకటనతో తాను విభేదిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా వ్యాఖ్యల్నే మరో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ కూడా చేయటం విశేషం. చిదంబరం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని ఆయన  పేర్కొన్నారు. నిజమే.. గాంధీ కుటుంబం సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తే.. వ్యక్తిగతమే అవుతాయి మరి.
Tags:    

Similar News