రెండేళ్ల‌కు అక్క‌డ అడుగు పెట్టిన రాహుల్‌...!

Update: 2021-12-14 14:31 GMT
ఉత్తరప్రదేశ్లోని ఆమేధి, రాయబరేలి ఈ రెండు నియోజకవర్గాల పేర్లు చెబితేనే నెహ్రూ కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చాయి. అయితే మధ్యలో రాయ్‌బ‌రేలీ నియోజకవర్గంలో మాత్రం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ తిరుగులేకుండా జెండా పాతేసింది. ఇక అమేధి నియోజకవర్గం 2004 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిపోయింది. అలాంటి నియోజకవర్గం 2019 లోక్‌స‌భ ఎన్నికల్లో బిజెపి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ప్ర‌స్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఘోరమైన పరాజయం.

అయితే అమేధిలో ఎలాగైనా రాహుల్ ను ఓడించాలని 2014 ఎన్నికలకు ముందు నుంచి బిజెపి ఎన్నో ప్రయత్నాలు చేసింది. రాహుల్ స్మృతి ఇరానీపై కేవలం లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీ అన్ని తానై అమేధిలో మ‌కాం వేయ‌డంతోనే నాడు రాహుల్ విజయం సాధించారు. బీజేపి అధికారంలోకి వచ్చాక గట్టిగా టార్గెట్ చేయడంతో గత ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ రాహుల్‌కు ముందుగానే ఓటమి సంకేతాలు తెలియడంతో.. ముందు జాగ్రత్తగా కేరళలోని కాంగ్రెస్ కంచుకోట అయిన వ‌య‌నాడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

అక్క‌డ భారీ మెజార్టీతో గెలిచిన రాహుల్ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తన నియోజకవర్గంలో అడుగుపెట్టని రాహుల్ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత అక్కడ కాలు పెట్టనున్నారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ ఈనెల 18వ తేదీన అమేధి వెళ్లి... అక్కడ నుంచి బిజెపి పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ పాదయాత్ర తోనే రాహుల్‌ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించ‌నున్నారు.

ఇక మరో సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పేరు ప్ర‌చారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ సైతం ఎలాగైనా తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధం కావడంతో యూపీ ఎన్నికలు బీజేపీ - కాంగ్రెస్ పార్టీ - ఎస్పీ - బీఎస్పీ ల మధ్య హోరాహోరీగా సాగనున్నాయి.

బిజెపి మరోసారి యూపీలో అధికారంలో నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే... సమాజ్‌వాది  పార్టీ మాత్రం ఎలాగైనా బిజెపిని గద్దె దింపాలని ప్లాన్లు వేస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఇప్పుడు అక్కడ పట్టు కోసం నానా పాట్లు పడుతున్నారు.
Tags:    

Similar News