సారీ చెప్పినా... రాహుల్ కు రిలీఫ్ లేద‌బ్బా!

Update: 2019-04-23 11:04 GMT
దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయంగా వేడి పుట్టింది. మొత్తం ఏడు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే రెండు ద‌శ‌లు పూర్తి కాగా... నేడు మూడో విడ‌త పోలింగ్ జ‌ర‌గుతోంది. ఇలాంటి కీల‌క త‌రుణంలో విప‌క్ష కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన *చౌకీదార్ చోర్ హై* వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కాగా...  ఎన్నిక‌ల వేళ ఈ గోలెందుక‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ రాహుల్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ మేర‌కు నిన్న కోర్టుకు ఆయ‌న రాత‌పూర్వ‌కంగా సారీ చెప్పారు. అయితే ఈ సారీ రాహుల్ రిలీఫేమీ ఇవ్వ‌క‌పోగా... మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేసింద‌నే చెప్పాలి.

రాహుల్ చెప్పిన సారీతో సంతృప్తి వ్య‌క్తం చేయ‌డానికి బ‌దులుగా... వివాదానికి రాహుల్ మ‌రింత‌గా ఆజ్యం పోశార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సుప్రీంకోర్టు ఆయ‌న‌కు ఏకంగా కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ విష‌యంపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నేటి విచార‌ణ‌లో భాగంగా సంజాయిషీ ఇస్తూ రాహుల్ పంపిన క్ష‌మాప‌ణ‌ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన కోర్టు... సారీ చెబుతూనే ఈ వివాదంలోకి కోర్టును ఎలా లాగుతారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సారీ చెబుతూనే... తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను కోర్టుకు ఆపాదిస్తున్న‌ట్లుగా రాహుల్ పంపిన సంజాయిషీ క‌రెక్టు కాద‌ని తేల్చేసిన కోర్టు... రాహుల్ కు ఏకంగా కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసుల‌ను జారీ చేసింది.

ఈ సంద‌ర్భంగా కోర్టు ఏమంద‌న్న విష‌యానికి వ‌స్తే.... *సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్రతివాది (రాహుల్ గాంధీ) తప్పుగా వ్యాఖ్యానించారు. చౌకీదార్ చోర్ అని అర్థం వచ్చేలా కోర్టు మాట్లాడలేదు. రాఫెల్ డీల్ కు సంబంధించిన డాక్యుమెంట్ల గురించే కోర్టు మాట్లాడింది* అని  ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదం నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఈ వివాదంలోకి కోర్టును అవ‌న‌స‌రంగా లాగ‌డ‌మంటే కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కే వ‌స్తుంద‌ని తేల్చేసిన ధ‌ర్మాస‌నం ఆయ‌న‌కు ఏకంగా కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేసింది. అంతేకాక‌కుండా కోర్టు ధక్కార పిటిషన్ కు రివ్యూ పిటిషన్ ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మొత్తంగా సారీ చెప్పిన రాహుల్‌... ఈ వివాదం నుంచి ఉప‌శ‌మ‌నం ఆశిస్తే... కోర్టు మాత్రం ఆయ‌న‌కు ఏకంగా కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News