ఎన్నికల వేళ.. ఈ పొగడ్తలేంది యువరాజా?

Update: 2016-07-30 10:17 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏమైంది. తప్పులు ఏ మాత్రం చేయకూడని వేళ.. తప్పుల మీద తప్పులు చేస్తున్న ఆయన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న లోక్ సభలో నిద్రపోయి అడ్డంగా బుక్ అయిన రాహుల్.. తర్వాత బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లి.. బాధితుల బంధువుగా భావించినఒక మహిళను ఓదార్చటం.. ఆమె కాస్తా నేరచరిత ఉన్న వ్యక్తిగా తేలటంతో పాటు బాధితులకు ఏ మాత్రం సంబంధం లేదని తేలటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.

ఇలా ఒకటి తర్వాత ఒకటిగా తప్పులు చేస్తున్న రాహుల్.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. మరికొద్ది నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు తెర లేవనున్న వేళ.. ఊరికి ముందే ప్రచారాన్ని స్టార్ట్ చేసిన రాహుల్.. ఆరంభంలోనే సెల్ఫ్ గోల్ కొట్టుకునేలా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు కాంప్లిమెంట్లు ఇచ్చారు. 43 ఏళ్ల అఖిలేశ్ వ్యక్తిగతంగా మంచి బాలుడు అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థిని గుడ్ బాయ్ గా కీర్తించటంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలిన పరిస్థితి.

వ్యక్తిగతంగా గుడ్ బాయ్ అయినప్పటికీ అఖిలేశ్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించారు రాహుల్.  అఖిలేశ్ మంచివాడైనప్పటికీ ఆయన ప్రభుత్వం మాత్రం పని చేయటం లేదన్న ఆయన.. ఎస్పీ సర్కారు హయాంలో యూపీలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యనించారు. వ్యక్తిగతంగా మంచోడు.. రాజకీయంగా చెడ్డొడు లాంటి వ్యాఖ్యలు సాదాసీదా ప్రజానీకానికి ఏం అర్థమవుతాయో రాహుల్ కే తెలియాలి. తమ నాయకుడు అఖిలేశ్ పై విరుచుకుపడతాడని ఊహించిన కాంగ్రెస్ నేతలకు.. ఆయనిచ్చిన కాంప్లిమెంట్లతో నోట మాట రాని పరిస్థితి. ఇలా మాటలతో షాకులివ్వటం రాహుల్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో..?
Tags:    

Similar News