మోడీవి టీఆర్‌ పీ రాజ‌కీయాలు

Update: 2016-12-03 04:59 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇమేజ్ చట్రంలో బందీ అయ్యారని.. ప్రజలు కష్టాలు పడుతున్న పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురికావడంతో రాహుల్‌ గాంధీ అధ్యక్షతన తొలిసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశమైంది. సీపీపీ సమావేశానికి తొలిసారి సారథ్యం వహించిన రాహుల్‌ గాంధీ ఈ స‌మావేశం సంద‌ర్భంగా ప్రధానిపై ధ్వజమెత్తారు. మోడీ టీఆర్పీ రాజకీయాలు చేస్తున్నారని, ఇమేజ్ చట్రంలో బందీ అయ్యారని మండిపడ్డారు. ప్రధాని అహంకారం - చేతకానితనంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధుల సలహాలను ప్రధాని మోడీ తీసుకొంటే.. నోట్ల రద్దు వంటి విఫల ప్రయోగాలతో దేశం ఇబ్బంది పడిఉండేది కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఆర్థికవేత్త నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదని అంటున్నారని ఈ నిర్ణయంతో ఏం సాధించాలని భావిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు."నల్లధనాన్ని ఏరివేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని ప్రధాని చెప్తున్నా.. కొత్త నల్లధనం మార్కెట్‌ కు మార్గం ఏర్పడింది. రాత్రికి రాత్రే నల్లధనం తెల్లధనంగా మారేందుకు ఈ నిర్ణయం అవకాశమిచ్చింది" అని విమర్శించారు. "భారతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం నల్లధనంతో నిండిపోయిందని ప్రధాని పొరపాటుపడ్డారు. దీంతో ముందు వెనుకా ఆలోచించకుండా దేశంలో చెలామణిలో ఉన్న 86శాతం నోట్లను ఒక్కసారిగా రద్దు చేశారు. దీంతో దేశంలోని 130కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది" అని మండిప‌డ్డారు. దేశంలోనున్న మొత్తం నగదు నల్లధనం కాదు. అలాగే, నల్లధనం మొత్తం నగదు రూపంలో లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నల్లధనంపై యుద్ధం చేస్తానని చెప్పి.. దేశ ఆర్థికమూలాలను నరికివేశారని ప్రధానిపై దుమ్మెత్తిపోశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News