లైట్ తీస్కో రాహుల్.. లైట్ తీస్కో...?

Update: 2022-05-03 16:30 GMT
అవును శతాధిక వృద్ధ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆయన కీలక బాధ్యుడు. అంతే కాదు ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాయకుడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో ఎవరు, ఆయన హోదా ఏంటి అని ఎవరైనా అడిగితే వారికి రాజకీయంగా ఏ మాత్రం అవగాహన లేదని అమాయకత్వమని  అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ అంటేనే గాంధీల సొత్తు. ఎంతో మంది సత్తా ఉన్న  నాయకులు అక్కడ ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్ నడిచేదీ. మనుగడ సాగించేది మొత్తం అంతా గాంధీ ఫ్యామిలీల మీదనే. ఒక విధంగా కాంగ్రెస్ కి గాంధీలే ప్రాణ వాయువు.

మరి ఆ విధంగా కనుక ఆలోచిస్తే వర్తమాన తరం గాంధీ రాహుల్ ఎంతటి బరువుని తన భుజాన మోస్తున్నాడో అర్ధమవుతుంది. నిజానికి రాహుల్ కి వ్యక్తిగత జీవితం ఉండకూడదా, ఆయన ఎక్కడికీ వెళ్ళకూడదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. దానికి జవాబు కూడా చెప్పవచ్చు. ఆ సంగతి అలా ఉంచితే రాహుల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పది, దేశాన్ని అర్ధ శతాబ్దానికి పైగా ఏలిన పార్టీ. దేశంలోని అన్ని రాష్ట్రాలను దశాబ్దాలా పాటు పాలించిన పార్టీ.

అలాంటి పార్టీకి నాయకుడిగా రాహుల్ ఉన్నారు. మరి ఆయన ఆ సంగతిని గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆయన తరచూ ఏదో విషయానికో వివాదానికో బీజేపీకి చిక్కేస్తున్నారు. ఆ మధ్యన నిండు పార్లమెంట్ లో ప్రధాని మోడీ వద్దకు వచ్చి హగ్ చేసుకోవడం ఒక కుర్ర చేష్టగా అంతా భావించారంటే ఆశ్చర్యం ఏముంది. అదే పార్లమెంట్ లో రాహుల్ కన్ను కొడుతూ మరోసారి టీవీ కెమెరాకు చిక్కారు.

ఇక రాహుల్ విషయంలో చాలా ప్రచారాలు ఉన్నాయి. ఆయన ఉన్నట్లుండి సడెన్ గా గాయబ్ అయిపోతారని అంటారు. ఆ టైమ్ లో దేశంలో సీరియస్ గా ఎన్నికలు జరుగుతూ ఉన్నా కూడా రాహుల్ లైట్ తీసుకున్నట్లుగా కనబడకుండా వెళ్ళిపోతారు అని ప్రచారంలో ఉన్నాయి. అంతే కాదు ఆయన రాజకీయాలను ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నారో తెలియదు కానీ ఆయన గత పద్దెనిమిదేళ్ళుగా పోతున్న పోకడలు అన్నీ కూడా పార్టీకి ఇబ్బందినే కలిగిస్తున్నాయనే చెబుతారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రాహుల్ ప్రెసిడెంట్ గిరీకి రాజీనామా చేయడాన్ని ఏ సగటు కాంగ్రెస్ కార్యకర్త అయినా సహించేదేనా. నా ఇష్టం, నేను రాజీనామా చేస్తాను అని ఆయన అనవచ్చు కానీ అది సొంత పార్టీ వారికి పలాయనవాదంగా ప్రత్యర్ధి పార్టీలకు ఆయుధంగా ఉంటుంది కదా. ఇక లేటెస్ట్ గా రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో దర్శనమిచ్చారు అన్న వార్తలతో పాటు వీడియోను బీజేపీ ప్రసారం చేస్తోంది.

కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఏ మాత్రం బాగులేదు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ వ్యూహాలు ఏంటో ఎవరికీ తెలియవు, అసలు అర్ధం కానే కావు. ఈ మధ్యనే ఉత్తరాదిన అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే కాంగెస్ సోది లోకి లేకుండా పోయింది. అయినా ఆ పార్టీఎలో గుణాత్మకమైన మార్పు ఏదీ రాలేదు. కాంగ్రెస్ ని ఒక గాడిన పెడతాను అంటూ వెళ్ళిన ఎన్నికల వ్యూహకర్త వెనక్కి తిరిగివచ్చారూ అంటేనే కాంగ్రెస్ బాగు ఎవరి చేతుల్లో ఉందో అర్ధమైపోతోంది.

ఈ పరిస్థితులు అన్నీ కూడా కాంగ్రెస్ ని మూలిగే నక్కగా మారిస్తే ఇపుడు నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ కనిపించాడంటూ బీజేపీ పెడుతున్న వీడియోలు నెత్తిన తాటిపండు పడినట్లుగానే ఉన్నాయని అంటున్నారు. ఇక దీని మీద కాంగ్రెస్ నాయకులు ఎంత సమర్ధించుకున్నా ఎదురుదాడి చేసినా కాంగ్రెస్ మాత్రం ఇబ్బందులో పడిపోయింది. దాన్ని అలా గురి చేస్తున్నది కూదా ఎవరో కాదు రాహుల్ గాంధీ అంటే సగటు అభిమానులు బాధ పడినా నిజమే కదా.

ఇక ప్రతీ దాన్ని లైట్ తీస్కోవడం రాహుల్ కి అలావాటే. పాపం కాంగ్రెస్ మీద అభిమానంతో మిగిలిన నాయకులు అంతా బీజేపీని ఆడిపోసుకుంటున్నారు. రాజకీయాలనే లైట్ తీసుకున్నారు అన్న విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ కి ఇలాంటివి పెద్దగా చికాకు పెట్టవేమో కూడా ఏది ఏమైనా రాహుల్ గాంధీ మాత్రం అక్కడ అపోజిషన్ లో ఉండడం బీజేపీకి సదా శ్రీరామ రక్షగా ఉందంటే తప్పుందా.

ఇవన్నీ పక్కన పెడితే నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ పక్కన ఉన్నది ఎవరో కాదు చైనా దౌత్యవేత్తని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చెప్పడం ఈ టోటల్ ఎపిసోడ్ లో కొసమెరుపు. రాహుల్ పక్కన ఉన్న మహిళ నేపాల్ లో చైనా రాయబారి హౌ యాంక్వీ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒక వైపు చూస్తే ప్రధాని మోడీ యూరప్ టూర్ లో బిజీగా ఉన్నారు. చైనాతో భారత్ సంబంధాలు ఇంకో వైపు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇపుడు భావి ప్రధానిగా కాంగ్రెస్ నుంచి పేర్కొనబడుతున్న రాహుల్ చైనా రాయబారితో ఉన్నారు అంటే లైట్ తీస్కోవాల్సిందే మరి అంటున్నారు. ఈ బీజేపీ విమర్శలేవీ రాహుల్ పట్టించుకోవాల్సింది లేదంతే.  లైట్ తీసుకుంటే చాలంతే.
Tags:    

Similar News