బాబుకు అసెంబ్లీ సీట్లపై ఉన్న శ్రద్ధ రాష్ర్టంపై లేదట

Update: 2017-06-29 08:04 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఎమ్మెల్యే సీట్లు పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలో ఏమాత్రం లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సీట్ల పెంపు కోసం చంద్రబాబు కేంద్రం వద్ద అన్ని రకాలుగా లాబీయింగ్ చేస్తున్నారని... కానీ విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో మాత్రం ఏ రోజు ఇంత శ్రద్ధ చూపించలేదని ఆరోపించారు.
    
తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పాకులాడుతున్నారు కానీ రాష్ర్ట ప్రయోజనాల కోసం, చట్టం ప్రకారం రాష్ర్టానికి ఉన్న హక్కులు, రావాల్సిన ప్రయోజనాల కోసం ఆయన చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదని మండిపడ్డారు.  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబు కోసం ఈ సీట్ల రాజకీయం చేస్తున్నారు కానీ రాష్ర్టం కోసం ఏమాత్రం పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు.
    
మరోవైపు రాష్ర్టంలో జ్వరాలు - కలుషిత నీరు వల్ల గిరిజనులు మరణిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజన, దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విరుచుకుపడ్డారు. బాధిత గిరిజనులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News