మెర్శ‌ల్‌ కు ఆ సీఎం మ‌ద్ద‌తు

Update: 2017-10-23 12:33 GMT
ఎగిసిన ప్ర‌తి కెరటం కింద‌కు దిగాల్సిందే. తిరుగులేని ఇమేజ్ తో రాజ‌కీయంగా ఎదురే లేకుండా పోయి.. స‌మీప భ‌విష్య‌త్తులో ప్ర‌ధాని మోడీకి మించిన మొన‌గాడు రానే రాడ‌న్న భావ‌న‌లో ఉన్న వారికి షాకిచ్చేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మోడీని ఎవ‌రో దెబ్బ తీయ‌కుండా.. ఆయ‌న్ను ఆయ‌నే దెబ్బ తీసుకోవ‌టం గ‌మ‌నార్హం.

జాతీయ రాజ‌కీయాల్లో ఎదురులేని విధంగా ఉన్న మోడీకి.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలే ఆయ‌న్ను దెబ్బ తీస్తున్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ అమ‌లుతో దేశ వ్యాప్తంగా వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతోంది. జీఎస్టీపై వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తూ త‌మిళ అగ్ర హీరో విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం మెర్శ‌ల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జీఎస్టీ మీద సినిమాలో హీరో పాత్ర‌ధారి చెప్పే వ్య‌తిరేక డైలాగుల‌కు థియేట‌ర్ మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగ‌టం చూస్తే మోడీ మీదా.. ఆయ‌న అమ‌ల్లోకి తెచ్చిన జీఎస్టీ మీద ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. మెర్శ‌ల్ పుణ్య‌మా అని జీఎస్టీ వ్య‌తిరేక ప్ర‌చారం అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టం క‌మ‌ల‌నాథుల్ని కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. త‌మ అధినాయ‌కుడికి వ్య‌తిరేకంగా సాగుతున్న ప్ర‌చారాన్ని అడ్డుక‌ట్ట వేసేందుకు గొంతులు పెంచుతున్నా.. అంత‌కు ధీటుగా విపక్షాల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని తిప్పి కొడుతున్న వైనం క‌మ‌ల‌నాథుల‌కు త‌ల‌నొప్పిగా మారింది.

మెర్శ‌ల్ చిత్రానికి పెరుగుతున్న మ‌ద్ద‌తు జాబితాలో తాజాగా ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి కూడా చేరారు. పుదుచ్చేరి సీఎం నారాయ‌ణ‌స్వామి తాజాగా స్పందించారు. మెర్శ‌ల్ వివాదంపై స్పందించిన ఆయ‌న భార‌త‌దేశంలో ప‌త్రిక‌ల స్వేచ్ఛ‌ను.. భావ‌స్వేచ్ఛ‌ను గ‌త రాజ‌కీయ నాయ‌కులు కాపాడుకుంటూ వ‌చ్చార‌ని.. దాన్ని బీజేపీ హ‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వ విధానాల్ని విమ‌ర్శించే వారిపై చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందంటూ ఆరోపించారు. మోర్శ‌ల్ సినిమా మోడీ పరివారానికి ముచ్చ‌మ‌ట‌లు పోయిస్తుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.
Tags:    

Similar News