రిసార్ట్ ఎమ్మెల్యేను రౌండప్ చేసిన తంబీలు

Update: 2017-02-27 07:54 GMT
చిన్నమ్మ పట్ల విధేయత ప్రదర్శించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు తమిళులు చుక్కలు చూపిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో శశికళ వర్గం బయటకు రావటానికి వణికిపోతున్న పరిస్థితి. చిన్నమ్మ ఆదేశాలతో రిసార్ట్స్ లో గడిపేసి.. ఆమె చెప్పినట్లే.. పళనిస్వామికి బుద్దిగా తమ మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళ ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ నటుడు కమ్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కరుణాసన్ తన నియోజకవర్గానికి వెళ్లిన సందర్భంగా జనాలు ఆయన మీద పడటమే కాదు.. మరోసారి కానీ నియోజకవర్గానికి కానీ రావాలని ప్రయత్నించావా? నీ సంగతి చూస్తామంటూ హెచ్చరించి మరీ పంపిన వైనం తెలిసిందే.

ఈ ఘటనను మర్చిపోకముందే.. దాదాపు అలాంటి చేదు అనుభవమే మరో ఎమ్మెల్యేకు ఎదురైంది. తాజాగా తిరుప్పూరు (ఉత్తర) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నాడీఎంకే చిన్నమ్మ పక్షానికి చెందిన ఎమ్మెల్యే విజయకుమార్ తాజాగా నియోజకవర్గాన్ని పర్యటించే పనిలో పడ్డారు. అమ్మ జయంతిని పురస్కరించుకొని.. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నియోజకవర్గానికి వెళ్లారు.

అయితే.. దారి మధ్యలో ఆయన్ను అడ్డుకున్న గ్రామస్తులు నిర్బంధించి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా రిసార్టుల్లో గడిపి వస్తావా? అంటూ నిలదీసిన ప్రజలు.. ఆయన్ను.. ఆయనతో పాటు ఉన్న మాజీ మంత్రి ఆనందనను అడ్డుకున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను నిర్బంధించిన చోటుకు వెళ్లి.. వారిని విడిపించారు. చూస్తుంటే.. చిన్నమ్మపక్షాన ఉన్న ఎమ్మెల్యేలకు తంబీలు చుక్కలు చూపించే విషయంలో వెనక్కి తగ్గట్లేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News