చిత్తూరులో జిల్లాలో వ్యభిచారం గుట్టురట్టు .. !

Update: 2020-08-19 09:37 GMT
చిత్తూరు జిల్లాలో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారం దందా వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం , అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తుంటే కొందరు మాత్రం అడ్డదారుల్లో  అక్రమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రశాంత్‌ నగర్‌ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.

మదనపల్లె పట్టణంలోని ప్రశాంత్‌ నగర్‌ లో చంద్రాకాలనీకి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు కలసి ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకొస్తున్నారు. ప్రశాంత్‌ నగర్ ‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వారితో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే , రోజురోజుకి  ఆ ఇంటికి వచ్చిపోయేవారి సంఖ్య ఎక్కువ కావడతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్, ఎస్సై వంశీధర్‌  సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అరెస్ట్ చేసి ఏడుగురు సెక్స్‌ వర్కర్లకు నిర్వాహకుల నుండి విముక్తి కల్పించారు. యువతుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి చీకటి వ్యాపారం చేస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News