నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ తయారీ.. డీఆర్డీవో ఘనత

Update: 2021-04-29 08:30 GMT
ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న భారతదేశానికి దేశీయ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)  ఉపశమనం కలిగించింది. ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు నడుం బిగించింది.

ప్రస్తుతం దేశంలో కరోనాతో బాధపడుతూ అనేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం పదులసంఖ్యలో కరోనా బాధితులు మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమైన ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం నడుం బిగించింది. డీఆర్డీవోను రంగంలోకి దింపింది.

తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించి దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

డీఆర్డీవో టెక్నాలజీ ద్వారా ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ తయారీ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంలో 190 మందికి ఆక్సిజన్ అందించవచ్చని.. అదనంగా 195 సిలిండర్లను నింపవచ్చని డీఆర్డీవో తెలిపింది.

డీఆర్డీవో రూపొందించిన ఆక్సిజన్ ప్లాంట్లు గాలిని పీల్చుకొని జియోలైట్ పదార్థం సాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 933శాతం గాఢతతో ఆక్సిజన్ ను వేరు చేస్తాయి. దీన్ని నేరుగా కోవిడ్ రోగులకు అందించవచ్చు. సిలిండర్లలోనూ నింపుకోవచ్చు.  

బెంగళూరులోని టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్, కోయంబత్తూరులోని ట్రైడెండ్ న్యూమాటిక్స్ లకు డీఆర్డీవో ఈ టెక్నాలజీని బదలాయించింది. ఈ రెండు సంస్థలు వెంటనే 380 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసి డీఆర్డీవోకు అందిస్తాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మరో 120 ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేసి ఇస్తుందని తెలిపారు.
Tags:    

Similar News