ఎలక్షన్ వాయిదాకు టీడీపీ ఫైట్ సీన్

Update: 2017-04-15 10:00 GMT
కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగడంతో అల్లకల్లోలం ఏర్పడింది.  మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి - వరదరాజులరెడ్డి వర్గాలుగా కౌన్సిలర్లు విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని చివరకు ఎన్నిక వాయిదాకు దారితీసింది.
    
ఎన్నికల సామాగ్రిని లింగారెడ్డి వర్గీయుడు పుల్లయ్య ఎత్తుకు పోయారు. వరదరాజులరెడ్డి వర్గీయులు కుర్చీలు - బెంచీలను ధ్వంసం చేశారు. దీంతో, ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లాఠీఛార్జ్ లో ఒకరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో, పోలీసుల వాహనంపైకి టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్ ఎన్నికను ఆర్డీవో రేపటికి వాయిదా వేశారు.  
    
కాగా... ఎన్నికలను వాయిదా వేయించే ఉద్దేశంతోనే టీడీపీ ఇలాంటి ఎత్తుగడ వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే తమ ఓటమి ఖాయమనుకున్న టీడీపీ సభ్యులు శనివారం పక్కా ప్రణాళికతో ఎన్నికల హాలులో వీరంగం సృష్టించారని చెబుతున్నారు.   తక్షణమే ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ కౌన్సిలర్లు కుర్చీలు - ఫర్నీచర్‌ ను ధ్వంసం చేయడంతో శాంతి భద్రతలను సాకుగా చూపిన అధికారులు ఛైర్మెన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
    
ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్న విధంగానే... ఎలాగైనా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌ కూడా దక్కించుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రతిపక్ష సభ్యులకు లేఖ రాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపించారు.  మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో వైఎస్‌ ఆర్‌ సీపీ నిన్నే విప్‌ జారీ  చేసింది. దీంతో గతంలో టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు.. తిరిగి వైఎస్‌ ఆర్‌ సీపీలోకి వచ్చారు. దీంతో టీడీపీ గెలుపు కష్టతరంగా మారింది.  సమావేశం నిర్వహించాలంటే మొత‍్తం 41మందిలో 21మంది హాజరు కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు హాజరుకాకపోయినా ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేయాల్సి ఉంటుంది. ఆదివారం కూడా కోరం లేకపోతే తిరిగి ఎన్నికల కమిషన్‌ కు తెలిపి తదుపరి వచ్చే నోటిఫికేషన్‌ వరకూ ఆగాల్సి ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News