మరోసారి చీపురుతో చెలరేగిపోయిన ప్రియాంక.. చిమ్మటంలో ఆమె తర్వాతే ఎవరైనా?

Update: 2021-10-10 03:36 GMT
కాల మహిమ కాకపోతే ఏంటి చెప్పండి? గాంధీల కుటుంబానికి చెందిన ఒకరు.. చీపురు పట్టుకొని చకచకా చిమ్మేయటం అంత మామూలు విషయమా? ముట్టుకుంటే కందిపోయేలా కనిపించే సున్నితంగా ఉండే వారు.. చిమ్మటంలో తమకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించటమే కాదు.. తమకున్న కమిట్ మెంట్ తో అందరిని ఆకర్షిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదో చిమ్మామంటే చిమ్మామన్నట్లుగా కాకుండా.. సీరియస్ గా చిమ్మటం అందరూ చేయలేరు. అయినా.. చీపురు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక ఫీల్ కావటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఆ మాటకు వస్తే చీపురు.. తమ రాజకీయ ప్రత్యర్థి కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు. ఈ విషయాన్ని ఆమె మర్చిపోయారేమో కానీ.. ఇటీవల కాలంలో చీపురు పట్టుకొని.. తన నిరసనను తెగ ప్రదర్శించేస్తున్నారు ప్రియాంక. మొన్నటికి మొన్న ఆందోళన చేస్తున్న రైతుల మీదకు వేగంగా దూసుకెళ్లేలా చేసిన కేంద్ర సహాయ మంత్రి కుమారుడి వాహన ఘటనపై   సీరియస్ అయిన ఆమె.. బాధితుల్ని పరామర్శించేందుకు నడుం బిగించటం యోగి సర్కారుకు అస్సలు నచ్చలేదు.

అంతే ఆమెను.. అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్టు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేసే క్రమంలో.. తనను ఉంచిన గెస్ట్ హౌస్ లో రూంను చీపురు పట్టి సీరియస్ గా శుభ్రం చేసిన వైనం దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. ప్రియాంక చర్యకు సీఎం యోగి కొత్త భాష్యం చెబుతూ.. ప్రియాంకకు ఆ పనులే సరిపోతాయనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించటం వివాదాస్పదంగా మారింది. తనపై సీఎం చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రియాంక మరోసారి  ఆమె చీపురు పట్టారు.

యూపీ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను ఆకస్మికంగా పర్యటించిన ఆమె.. అక్కడున్న చీపురు తీసుకొని శుభ్రం చేశారు. తన చర్యను ఆత్మగౌరవ చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా చిమ్మిన ఆమె కమిట్ మెంట్ ను మాత్రం మెచ్చుకోవాల్సిందే. చిమ్మే క్రమంలో.. అడ్డుగావచ్చిన కుర్చీని పక్కకు జరిపి చిమ్మేశారే తప్పించి.. ఏదో యాక్టింగ్ కోసం అన్నట్లు కాకుండా సీరియస్ గా చిమ్మేశారు. అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మీద  ఘాటుగా రియాక్టు అయ్యారు.
ఆయన తన మాటలతో తన ఒక్కరినే అవమానించలేదని.. ఆ పని చేసే కార్మికులందరిని అవమానించారన్నారు. ''మీతో పాటు నేను కూడా ఈ పని చేసేందుకు ఇక్కడకు వచ్చాను. పరిసరాల్ని శుభ్రం చేయటం.. చీపురు పట్టటం ఆత్మగౌరవ చర్య అని తెలియజేయటానికి వచ్చాను'' అని పేర్కొన్నారు. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించింది. ఆ తర్వాతి కాలంలో అదో పాత గురుతుగా మిగిలిపోయింది. ఆ రోజుల్ని మళ్లీ తీసుకురావాలన్నదే ప్రియాంక లక్ష్యమన్నట్లుగా ఆమె ప్రయత్నిస్తున్నారు. మరి.. యూపీ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News