ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ ఉందా?

Update: 2021-01-24 04:42 GMT
పంచాయితీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నడుస్తున్న పంచాయితీ ఒక కొలిక్కి రాకపోగా.. అంతకంతకూ పీటముడులు మరింతగా బలపడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సంఘం పోటాపోటీగా ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యవహారం ప్రతిష్టంభనకు తెర తీయటమే కాదు.. కొత్త పరిణామాలకు దారి తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది.

పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించాలని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుదలతో ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లో కుదరదంటే కుదరదని ప్రభుత్వం మరింత మొండిగా ఉంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పనుల్లో బిజీగా ఉన్నందున.. వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యాక మాత్రమే.. ఎన్నికల్ని నిర్వహించాలని ఏపీ సర్కారు కోరుతోంది. అయితే..ఆ  వాదనను పరిగణలోకి తీసుకోని నిమ్మగడ్డ.. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నాలుగు దశలకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే.. దీన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చటమే కాదు.. నిమ్మగడ్డ ఏర్పాటు చేసిన వీడియో సమావేశానికి అధికారులంతా గైర్హాజరయ్యారు. దీంతో.. ప్రభుత్వ పంతమే నెగ్గింది. టీకా వేయకుండా ఎన్నికల విదుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తే.. ఎన్నికల్ని అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉద్యోగ సంఘాల వైఖరిని తప్పు పట్టింది.

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే.. సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి వస్తోందన్న హెచ్చరికను చేశారు. అయినప్పటికీ ఎవరూ ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీతో సహా అధికారులు ఎవరూ హాజరు కాలేదు. తాజా పరిణామాలపై న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వం తీరుపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని వివరించేందుకు రాష్ట్ర గవర్నర్ అపాయింట్ మెంట్ ను నిమ్మగడ్డ కోరారు. అయితే.. రాజ్ భవన్ నుంచి ఇంతవరకు స్పందన రాలేదంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతూ.. రాష్ట్రపతి పాలనకు నిమ్మగడ్డ ప్రతిపాదనలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ.. ఆయన తీసుకుంటే మాత్రం కేంద్రం అందుకు సమ్మతిస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. ఏమైనా.. ఏపీలో నెలకొన్న ఎన్నికల వ్యవహారం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News