గవర్నర్ ను వాళ్లమ్మ పురిట్లోనే చంపాలనుకుందట

Update: 2016-02-07 09:11 GMT
ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత అంశాలు వెల్లడించటం.. అది కూడా తన పుట్టుక సందర్భంగా ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించటానికి పెద్దగా ఇష్టపడరు. అయితే.. తన ఉదంతాన్ని ఒక ఉదాహరణగా చెప్పాలని భావించిన గోవా రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హా చెప్పిన విషయాలు విస్మయాన్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

ప్రధాని మోడీ షురూ చేసిన బేటీ బచావో కార్యక్రమం నేపథ్యంలో ఆమె తన పుట్టుకకు సంబంధించిన విషయాల్ని బహిరంగంగా బయటకు చెప్పుకొచ్చారు. తాను పుట్టే సమయానికి తన తల్లికి 40 ఏళ్లు అని..ఆ వయసులో గర్భం దాల్చటంపై తన తల్లి భయపడిందని ఆమె పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందోనన్న ఆలోచనతో గర్భస్రావం కోసం మందులు తాగిందని.. అయితే తన తండ్రి కలుగజేసుకొని ఆమెకు వైద్యం చేయించటంతో తాను పుట్టినట్లుగా పేర్కొన్నారు.

బేటీ బచావో అన్న కార్యక్రమాన్ని ప్రధాని షురూ చేసిన సందర్భంలో తన పుట్టుక విషయాలు గుర్తుకొచ్చాయన్న ఆమె.. తన తల్లిని తీసుకొని తన తండ్రి వేరే ప్రాంతంలో వైద్యం చేయించటంతో తానీ లోకంలోకి రావటానికి కారణమైందని ఆమె పేర్కొన్నారు. తన చిన్నతనంలో ఆడపిల్లల్ని చదివించే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేయని.. ఇప్పుడు పరిస్థితి మారిందని.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆడపిల్లల్ని చదివిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఏమైనా మృదుల సిన్హా తండ్రి విజన్ కు హేట్సాప్ చెప్పాల్సిందే కదూ.
Tags:    

Similar News