మన్మోహన్ పాఠాలు చెప్పడానికి లైన్ క్లియర్!

Update: 2016-10-25 04:28 GMT
ప్రధాని కాకముందు వరకూ ఆయన గొప్ప విద్యావంతుడు - అతితెలివైన - చురుకైన వ్యక్తి. ప్రధాని అయిన తర్వాతా... ఆయనై మౌన ముని అని ముద్దు పేరు వచ్చి చేరింది. అయితే ఈ మౌనముని తిరిగి తన పాత వృత్తిలోకి, తనకు ఎంతో ఇష్టమైన పనిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను ఎక్కడైతే చదివారో, ఏ యూనివర్శిటీలో అయితే అధ్యాపకుడిగా పనిచేశారో అదే విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. ఆయనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.

తాను ఒకప్పుడు చదువుకున్న పంజాబ్‌ విశ్వవిద్యాలయంలోనే ఓ ప్రతిష్ఠాత్మక బాధ్యతను నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌. పూర్వ విద్యార్ధిగా - పూర్వ అధ్యాపకుడిగా కూడా మన్మోహన్‌ సింగ్‌ కు పంజాబ్‌ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలో "జవహర్‌ లాల్‌ నెహ్రూ ఛెయిర్‌ ప్రొఫెసర్‌"గా ఉండాల్సిందిగా పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది. దీంతో గత జులైలోనే ఈ విషయంపై మన్మోహన్‌ నేరుగా రాజ్యసభ ఛైర్మన్‌ తో సంప్రదించారు. అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న తాను ఆ ప్రొఫెసర్ పదవిని అలంకరిస్తే సభ్యత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుందా? రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఎ) కింద అనర్హత వేటు పడే అవకాశం ఉందా? అని రాజ్యసభ చైర్మన్ ను అడిగారు.

ఈ నేపథ్యంలో సంబంధిత సంయుక్త సంఘం ఈ నెల 14న లోక్‌ సభ స్పీకరుకు తన నివేదికను సమర్పించింది. పంజాబ్‌ వర్సిటీ ఇచ్చిన ప్రతిపాదనను మన్మోహన్‌ సింగ్‌ తీసుకుంటే... ఎలాంటి అనర్హత సమస్యా ఉండదని ఆ నివేదిక స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయ సిండికేట్‌ - సెనేట్‌ లు నిర్ణయించిన ప్రకారం ఛెయిర్‌ ప్రొఫెసర్‌ బాధ్యతను తీసుకున్న నేపథ్యంలో మన్మోహన్‌ గౌరవవేతనాన్ని పొందుతారు. ఇది స్వల్పకాలిక వ్యవధి హోదా మాత్రమే అని కూడా వర్సిటీ స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే ఆయన యూనివర్సిటీలో జవహర్‌ లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్‌ షిప్‌ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News