కాంగ్రెస్ కి ఇగో..పతనానికి అదే రీజన్... ?

Update: 2022-02-07 02:31 GMT
ఇగో ఉంటే మనిషి అయినా సంస్థ అయినా మటాష్ అవక తప్పదు. ఎపుడైతే మనిషి తనను తాను మరచిపోతాడో, భ్రమల్లో తానే గొప్ప అనుకుంటాడో నాటి నుంచే పాతాళం వైపు అడుగులు పడతాయి. ఇక సంస్థ అయినా అంతే. కళ్ళ ముందు చూస్తే శతాధిక వృద్ధ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్  స్వాతంత్రానికి అరవై రెండేళ్ల ముందు పుట్టిన పార్టీ. ఈ దేశానికి తానే స్వాతంత్రం తెచ్చాను అని చెప్పుకున్న పార్టీ.

ఇక ఈ దేశాన్ని అర్ధ శతాబ్దం పైగా ఏలిన రికార్డు కూడా కాంగ్రెస్ దే. ఆసేతు హిమాచలం అంతటా కాంగ్రెస్ జెండా ఎగిరిన దశాబ్దాలు ఎన్నో. కాంగ్రెస్ పార్టీ తెలియని వారు కూడా ఉండరు. అలాంటి కాంగ్రెస్ ఇపుడు ఎన్నడూ చూడని తీరున కడు  పతనావస్థలో ఉంది.

ఒక వైపు దేశంలో మోడీ ఇమేజ్ తగ్గిపోతున్నా కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో పెరగడంలేదు, దానికి నాయకత్వ సమస్య ఒక కారణం అయితే కాంగ్రెస్ లో అహంకార ధోరణులు మరో కారణం అని చెబుతారు. ఎంతటి నాయకుడు అయినా కాంగ్రెస్ లో అధినాయకత్వం ముందు తల వంచాల్సిందే.  సరైన సలహా ఇచ్చినా కూడా అది తమకు నచ్చకపోతే ఆ నాయకుడిని టార్గెట్ చేస్తారు. అలా గులాబ్ నబీ అజాద్, మనీష్ తివారీ వంటి నేతలు ఇపుడు కాంగ్రెస్ లో సైడ్ అయిపోయారు.

ఇంకో వైపు చూస్తే ఈ రోజుకు కాంగ్రెస్ కి దశ దిశ నిర్దేశం చేసే లీడర్ షిప్ ఉందా అన్నదే డౌట్. క్రియాశీల రాజకీయాల నుంచి సోనియా గాంధీ దాదాపుగా దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ పూర్తిగా ట్వీట్లకే పరిమితమైపోతున్నారు, ఇక  తనకు నచ్చిన తీరున టూర్లు వేస్తున్నారు. ఆయన వచ్చినా వెళ్ళినా పార్టీకి బూస్టప్ అయితే లేదనే చెబుతున్నారు. చెల్లెలు  ప్రియాంకా గాంధీ ఉన్నారు అంటే ఆమె కూడా పూర్తి స్థాయిలో పార్టీని నడిపీంచే సీన్ లేదు.

ఈ నేపధ్యంలో రాహుల్ ఎంతసేపూ మోడీని టార్గెట్ చేస్తూంటారు. కేంద్రాన్ని విమర్శిస్తారు. అయితే అది బాగానే ఉన్నా ముందు సొంత పార్టీని తీర్చి దిద్దుకోవాలి కదా. ఇక రాష్ట్రపతి ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే తీర్మానికి సంబంధించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ అయితే లోక్ సభ సాక్షిగా  కాంగ్రెస్ గాలి తీసేశారు.

ఎన్ని సార్లు ఓడించినా గుణ పాఠం నేర్చుకోని పార్టీ అంటూ ఇజ్జత్ తీసేశారు. కాంగ్రెస్ ఈ దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి చోట్ల గెలుపు పిలుపు విని ఎన్ని దశాబ్దాలు అయింది అని నిలదీశారు. కాంగ్రెస్ కి ఇగో ఎక్కువ అంటూ మోడీ పేల్చిన పంచ్ కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నిండు సభలో పరువు తీసేలాగానే ఉంది. మొత్తానికి మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ కి గట్టిగానే టార్గెట్ చేశారు.

ఎవరో అన్నారని కాదు కానీ కాంగ్రెస్ ఇపుడున్న స్థితిని చూసి సొంత పార్టీ వారే కలవరపడుతున్నారు. మోడీ ప్రధానిగా ఉన్నారని రాజకీయ విమర్శలు చేయడం కాదు, ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ధ్యాస అయితే కాంగ్రెస్ కి నికరంగా ఉందా అన్నదే ప్రశ్న. కాంగ్రెస్ కి ఇగో ఉంటే మాత్రం రిజల్ట్ ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, ఫ్యూచర్ మీద జాతకాలు సర్వేలూ కూడా అసలు అవసరం లేదు. అర్జంటుగా కాంగ్రెస్ దాన్ని లేకుండా చేసుకోవాలి. మోడీ కోపంలో చెప్పినా కాంగ్రెస్ కి మంచి హితోపదేశమే చేశారేమో.
Tags:    

Similar News