ఎస్సీ రైతులపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులా ?

Update: 2020-10-27 08:10 GMT
అమరావతి రాజధాని ప్రాంతంలోని పోలీసుల వైఖరి విచిత్రంగా ఉంది. నాలుగు రోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గంలోని కృష్ణాయపాలెంలోని గ్రామంలో జరిగిన చిన్న ఘటనపై పోలీసులు అతి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడం గ్రామంలో దళిత బహుజన జనసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు కొందరు మహిళలు ఆటోలో వస్తున్నారు. వాళ్ళ ఆటోలు కృష్ణాయపాలెం గ్రామంలోకి రాగానే కొందరు అడ్డుకున్నారు.

అమరావతికి మద్దతుగా తాము 300 రోజులకు పైగా జరుపుతున్న ఆందోళనలకు పోటీగా మందడంలో ఆందోళన చేయటంపై కొందరు మండిపడ్డారు. వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటోలను అడ్డుకున్నారు. అదే సమయంలో కొందరు అత్యుత్సాహంతో ఓ ట్రాక్టర్ ను ఆటోల మీదకు నడిపించారు. అయితే ఇతరులు అడ్డుకోవటంతో ట్రాక్టర్లను ఆపేశారు. కానీ మరికొందరు ఆటోలపై కర్రలతో కొట్టి వాటి అద్దాలను పగలగొట్టేశారు. తమ గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమానికి ఇతర గ్రామాల వాళ్ళకు పనేమిటంటూ కృష్ణాయపాలెంలోని స్ధానిక ఆందోళనకారులు మండిపోయారు.

కృష్ణాయపాలెంలో హఠాత్తుగా జరిగిన ఘటనతో బిత్తరపోయిన మహిళలు తర్వాత ఆందోళనలు నిర్వహించారు. ఇంతలో పోలీసులు వచ్చి రెండు వైపులా సర్దిచెప్పి ఘటనను సద్దుమణిగేట్లు చేశారు. అక్కడితో ఘటన అయిపోయిందనే అనుకున్నారు. కానీ తర్వాత పోలీసులు మహిళలను అడ్డుకున్న వారిలో 11 మందిపై కేసులు పెట్టారు. అదికూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం సంచలనంగా మారింది. విచిత్రమేమిటంటే పోలీసులు నమోదు చేసిన 11 మందిలో ఎస్సీలు, బీసీలే ఉన్నారు.

అంటే ఎస్సీలపైనే పోలీసులు ఎస్సీ అట్రాసిటి కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ఇక్కడే ఓ సందేహం మొదలైంది. ఎస్సీలపై వేధింపుల కోసం రూపొందించిన ఎస్సీ అట్రాసిటీ కేసును ఎస్సీలపైనే ప్రయోగించవచ్చా అన్నదే ఇపుడు సమస్య అయ్యింది. ఇదే విషయంపై పోలీసులు ఏమీ మాట్లాడటం లేదు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తే తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటే ఇక పోలీసులు కేసు ఎలా పెడతారంటూ 11 మంది మండిపోతున్నారు. ఫిర్యాదు చేసిన ఈవూరి రవిబాబు కూడా తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎవరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టమని అడగలేదని చెప్పటం కొసమెరుపు.
Tags:    

Similar News