పోలీసులే టార్గెట్ అవుతున్నారా ?

Update: 2021-10-21 11:32 GMT
అందుకనే పోలీసులను కరివేపాకుతో పోలుస్తుంటారు. ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు చెప్పినట్లు వినటమే పోలీసుల పనిగా మారిపోయింది. ఏ విషయంలో అయినా స్వేచ్ఛగా తమ పని తాము చేసుకునే అవకాశం పోలీసులకు ఉండటం లేదు. తాము చెప్పినట్లు వినాల్సిందే అనే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళకు చాలామంది పోలీసులు లొంగిపోతున్నారు. దీని ఫలితంగా మంత్రులు, అధికార పార్టీ ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలు ఏమి చెబితే అది వినే స్థాయికి పోలీసు శాఖ దిగజారిపోయింది.

ఇపుడు విషయం ఏమిటంటే గడచిన చంద్రబాబు నాయుడు ఇఛ్చిన బంద్ పిలుపు సందర్భంగా అనేక మంది టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కొందరిని ముందస్తు అరెస్టులు కూడా చేశారు. దీనిపై చంద్రబాబు మండిపోయి పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారంటు విమర్శించారు. అధికార పార్టీ చెప్పినట్లు వింటున్న పోలీసు అధికారుల పేర్లను గుర్తుపెట్టుకుంటామంటు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే దీనికి బదులు తీర్చుకుంటామంటు వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబే పోలీసులను నోటికొచ్చినట్లు తిడుతుంటే ఇక అచ్చెన్నాయుడు, చింతకాయల లాంటి నేతలు ఊరుకుంటారా ? ఒకసారి చరిత్రను తిరగేస్తే 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏం చేశారో అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రతిపక్ష వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపై పోలీసులను యధేచ్చగా ప్రయోగించిన విషయం అందరూ చూసిందే. చంద్రబాబు ఏదన్నా జిల్లాలకు పర్యటనకు వస్తే ముందురోజు రాత్రే వైసీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసేశారు. అపుడు కూడా ముందస్తు అరెస్టులు జరిగాయి.

ఆందోళనలకు, నిరసననలకు, దీక్షలకు వైసీపీ దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించటం, ముందు అనుమతిచ్చి వెంటనే రద్దు చేయటం లాంటివి చాలానే జరిగాయి. అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్లు వినటానికి పోలీసులు అలవాటు పడిపోయారు. అధికారంలో ఏ పార్టీ ఉంది అనే విషయం పోలీసులకు అనవసరం. విచిత్రమేమిటంటే అప్పట్లో పోలీసులపై వైసీపీ వాళ్ళు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఇపుడు టీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు.

మొత్తానికి అప్పుడు ఇఫుడే కాదు ఎప్పుడూ పోలీసులే టార్గెట్ అవుతున్నారన్న విషయం అర్ధమైపోయింది. నిజానికి శాంతిభద్రతల విషయంలో రాజకీయ జోక్యం ఏ మాత్రం క్షమార్హం కాదు. కానీ క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది మాత్రం పూర్తిగా విరుద్ధం. పోలీసులను వాళ్ళపని వాళ్ళని స్వేచ్చగా చేసుకోనిస్తే ఏ కేసు దర్యాప్తు అయినా విచారణ అయినా పోలీసులు ఉత్తమంగా చేస్తారనటంలో సందేహంలేదు. పోలీసులు తలచుకుంటే ఎంతటి నేరస్తుడిని అయినా వెంటనే పట్టేసుకుంటారని గతంలోనే నిరూపణైంది. ఇపుడు పోలీసులను చూస్తుంటే అందుకే పాపం అనిపిస్తోంది.


Tags:    

Similar News