సూసైడ్ చేసుకుంటున్నాడని డయల్ 100కు ఫోన్ చేస్తే?

Update: 2019-12-06 06:38 GMT
దిశ హత్యాచార ఉదంతం.. అనంతరం వెలుగు చూసిన అంశాలు.. పోలీసుల పని తీరు మీద వెల్లువెత్తిన విమర్శలు తెలంగాణ పోలీసుల మీద ప్రభావాన్ని చూపించాయా? అంటే అవునని చెబుతున్నారు. దిశ కనిపించటం లేదని.. ఆమె ఫోన్ స్విచ్చాప్ అయ్యిందన్న విషయాన్ని శంషాబాద్ పోలీసులకు ఆమె తల్లిదండ్రులు చెబితే.. సరిహద్దు పంచాయితీలతో పాటు.. చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని అదే పనిగా ప్రకటనలు చేశారు. పోలీసుల్లో అలెర్ట్ నెస్ పెరిగిందన్న మాట వినిపించింది. దీనికి తగ్గట్లే తాజాగా ఒక ఉదంతం సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. చిలకలగూడలో 45 ఏళ్ల అక్బర్ ఖాన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కార్పెంటర్ గా పని చేసే అక్బర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

గురువారం జరిగిన గొడవల్లో మద్యం మత్తులో ఉన్న అక్బర్ భార్యపైన దాడి చేశాడు. దీంతో ఆమె డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో మనస్తాపానికి గురైన అక్బర్ గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందే అక్బర్ సతీమణి డయల్ 100కు ఫోన్ చేయటంతో చిలకలగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. పెట్రో కార్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు సమాచారం ఇవ్వటంతో అతను ఘటనాస్థలానికి చేరుకున్నాడు.

తలుపులు కొట్టినా స్పందన లేకపోవటంతో కిటికీలో నుంచి చూడగా అక్బర్ ఉరి వేసుకోవటం కనిపించింది. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ కిరణ్ తలుపును బలంగా తన్నటంతో తలుపులు తెరుచుకున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడ్ని గాంధీకి తరలించారు. పోలీసులు తక్షణమే స్పందించటంతో అతన్ని కాపాడగలిగారు. డయల్ 100కు ఫోన్ చేసిన ఏడు నిమిషాల లోపే పోలీసులు స్పందించి ఘటనాస్థలానికి చేరుకోవటంతో అక్బర్ ను పోలీసులు రక్షించగలిగారు.
Tags:    

Similar News