పోలవరం ఆగిపోయింది

Update: 2016-07-23 07:39 GMT
ప్రతిష్ఠాత్మక ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం పనులు ఆగిపోయాయి. ఇందుకు దారి తీసిన పరిస్థితులను చూస్తే ప్రభుత్వం - అధికారులు ఇంతవరకు ఏం చేశాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మూడు నెలలుగా కార్మికులకు జీతాలు అందకపోవడంతో వారు పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇంతవరకు వచ్చేవరకు కూడా ప్రభుత్వం మేలుకోకపోవడంతో ఏకంగా పనులు ఆగిపోయాయి.

తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ కార్మికులు సమ్మెకు దిగడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శుక్రవారం నుండి నిలిచిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్టు ఏజన్సీలో పనిచేస్తున్న పొక్లయినర్లు - డంపర్ల డ్రైవర్లతోపాటు సూపర్‌ వైజర్లు - సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగారు. దీనితో ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన స్పిల్‌ వే ప్రాంతంలో రోజుకు 25వేల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీ పనులు నిలిచిపోయాయి.

నిజానికి ఈ నెల 20 నుంచి జీతాలు చెల్లించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. పనులు మాత్రం కొనసాగించారు.  శుక్రవారం మాత్రం వారంతా పనులు నిలిపివేశారు. కాంట్రాక్టు ఏజన్సీలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 500మంది పనిచేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు గత మూడు నెలలుగా ఒక్క రూపాయి కూడా పంపించలేకపోతున్నామని, దాంతో భార్యపిల్లలు పస్తులుండవలసిన దుస్థితి నెలకొందని కార్మికులు చెబుతున్నారు.  తమ వేతనాల బకాయిలు చెల్లిస్తే, ఇక్కడ పని మానివేసి తమ ప్రాంతాలకు వెళ్లిపోతామని వారంతా అంటున్నారు.  కాంట్రాక్టు సంస్థ కానీ.. అధికారులు కానీ తమను  పట్టించుకోకపోవడంతో వారు ఏకంగా పనులు ఆపేశారు.  దీంతో పోలవరం పనులపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీలైనంత వేగంగా ప్రాజెక్టుకును పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం పనులు ఆగిపోయే వరకు ఏం చేస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags:    

Similar News