పండుగ వేళ అనూహ్యం: అకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన మోడీ

Update: 2023-03-31 09:54 GMT
అనూహ్యంగా వ్యవహరించే విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందుటారు. అంచనాలకు తగ్గట్లు ఆయన తీరు ఉంటుంది. ఎప్పుడేం చేస్తారో ఎవరికి అర్థం కాని రీతిలో ఆయన నిర్ణయాలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగ వేడుకల్లో మునిగిపోయిన వేళలో.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అనూహ్యంగా వ్యవహరిస్తూ ఆకస్మిక పరిశీల నిమిత్తం కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా సందర్శించటం గమనార్హం.

ఆకస్మికంగా పార్లమెంటు భవనాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రధాని.. అలా వచ్చి ఇలా వెళ్లిపోకుండా దాదాపుగా గంటన్నరకు పైనే ఆయన అక్కడ గడపటం.. కొత్త నిర్మాణానికి సంబంధించిన వివరాలతోపాటు.. అక్కడ జరుగుతున్న ప్రతి పనిని నిశితంగా పరిశీలించినట్లు చెబుతున్నారు. దాదాపు గంటన్నర విలువైన కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు నూతన భవనంలో గడిపారు.

అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి.. వివరాల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వెంట లోక్ సభ స్పీకర్ కూడా ఉన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి ఈ భవనాన్ని గత ఏడాదిలోనే పూర్తి చేయాలని భావించినా.. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. అత్యాధునిక వసతులతో ఉన్న పార్లమెంట్ కొత్త భవనంలోని అత్యాధునిక సాంకేతికత వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రఖ్యాత టాటా సంస్థ చేపట్టిన ఈ నిర్మాణ పనులను 2020 డిసెంబరులో షురూ చేయటం తెలిసిందే. నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్న కార్మికులతో స్వయంగా మాట్లాడిన మోడీ.. తన మాటలతో వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ప్రధాని మోడీ చేశారని చెబుతున్నారు. ఏమైనా.. ఇలాంటి అనూహ్య పరిణామాలతో ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్ ప్రదర్శిస్తారని మాత్రం చెప్పక తప్పదు.

Similar News