మోడీ కేరాఫ్ యూపీ!

Update: 2022-01-03 11:30 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌స్తుతం ఎక్క‌డున్నారు.. అంటే ఎక్కువ‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే క‌నిపిస్తున్నార‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న‌కు సంబంధించిన వార్త‌ల్లో అక్క‌డి డేట్‌లైన్లే క‌నిపిస్తున్నాయి. వార‌ణాసి కాన్పూర్‌, మీర‌ట్‌.. ఇలా యూపీలో ప్ర‌ధాని తెగ ప‌ర్య‌టించేస్తున్నారు. డిసెంబ‌ర్ 13న కాశీ విశ్వ‌నాథ్ కారిడ‌ర్ ఆరంభోత్స‌వం.. డిసెంబ‌ర్ 28న కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం.. కాన్పూర్ ఐఐటీ స్నాత‌కోత్స‌వం.. తాజాగా మీర‌ట్‌లో మేజ‌ర్ ధ్యాన‌చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న‌.. ఇలా మోడీ యూపీలో ఇటీవ‌ల ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

స‌భ‌లు.. ప్రారంభోత్స‌వాలు.. స్నాత‌కోత్స‌వాలు.. శంకుస్థాప‌న‌లంటూ మోడీ యూపీలో ప‌ర్య‌టించ‌డానికి కార‌ణం ఒకంటుంది. అదే మార్చిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు. దేశంలోనే కీల‌క రాష్ట్రమైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసమే మోడీ యూపీ నామ‌జ‌పం చేస్తున్నార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. వివిధ కార్య‌క్ర‌మాల కోసం అక్క‌డికి వెళ్తున్న మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సీఎం యోగిని ప్ర‌శంసిస్తూ.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌ను విమ‌ర్శిస్తూ ఉప‌న్యాసాలిస్తున్నారు. వెళ్లిన ప్ర‌తి చోటా ఇదే విష‌యాన్ని హైలైట్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ స‌ర్కారుపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతుందని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి ప్ర‌తికూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెప్తున్నారు. ఈ విష‌యాన్ని ముందుగానే గ్ర‌హించిన మోడీ.. అక్క‌డ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు యూపీ బాట ప‌ట్టార‌ని తెలుస్తోంది. యోగి ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్న మోడీ.. అదే స‌మ‌యంలో ప్రతిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. యూపీలో అధికారం కోసం కాంగ్రెస్‌తో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నిక‌ల స‌మ‌రానికి సై అంటున్నాయి. ఇప్ప‌టికే కొన్ని పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని యూపీపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఎక్క‌డ ఎన్నిక‌లు ఉన్నా ఆ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించ‌డం కొత్తేమీ కాదు. ఇదివ‌ర‌కు బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లోనూ ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో ప‌ర్య‌టించారు. ఇక ఈ ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న మ‌రింత యాక్టివ్ అయ్యారు. అయితే త్వ‌ర‌లోనే యూపీతో పాటు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కానీ పంజాబ్‌పై బీజేపీ ఆశ‌లు పెట్టుకోన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే త‌మ చేతుల్లో నుంచి చండీగ‌ఢ్ న‌గ‌ర పాల‌క సంస్థ‌ను పోగొట్టుకున్న బీజేపీ పంజాబ్‌పై ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించ‌లేదు. ఇప్ప‌టికైతే మోడీ ధ్యాస మొత్తం యూపీ పైనే ఉంద‌నేది టాక్‌.




Tags:    

Similar News