బర్త్ డే: కేసీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

Update: 2020-02-17 16:30 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేటితో 66 ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 17వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. టీఆర్ఎస్ కార్యక్రమాలు మొక్కలు నాటి కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే కేసీఆర్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

- ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

- ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్వీటర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ.. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.. అని ట్వీట్ చేశారు.

- మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నా అని ట్విటర్ లో తెలిపారు.

- ఇక కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ తన తండ్రి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు. ప్రగతి భవన్ లో తన సోదరి కవిత, తల్లి శోభ, భార్యాపిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ఒక వ్యాఖ్య చేశారు.. ‘తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేస్తూ ఉద్వేగానికి గురయ్యారు.
- ‘నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయార్ద్ర హృదయుడు, ప్రజాకర్షక నేతకు.. నాన్నా అంటూ సగర్వంగా పిలుచుకునే వ్యక్తికి.. మీరు చిరకాలం వర్ధిల్లాలని, మీ అంకితభావం, దూరదృష్టితో మాలో మరింత స్ఫూర్తినింపాలని కోరుతూ.. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేటీర్ ట్వీట్ చేశారు.

కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మొక్కలు పెద్ద ఎత్తున నాటారు. కేసీఆర్ కు రాజకీయ నాయకులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన వారు, పారిశ్రామిక వేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

రైతు దినోత్సవంగా కేసీఆర్ జన్మదినం ఫిబ్రవరి 17 కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా తెలంగాణ రైతు దినోత్సవంగా జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.





Tags:    

Similar News