ప్రగతి భవన్ లోకి వెళ్లి పెండ్లి పత్రిక ఇచ్చిన ఫణికర మల్లయ్య

Update: 2020-12-08 04:35 GMT
తెలంగాణ రాష్ట్ర అధికార కేంద్రం ప్రగతిభవన్. సీఎం కేసీఆర్ నివాసమైన ఇందులోకి వెళ్లాలంటే మంత్రులకే.. ఎంట్రీ లభించని పరిస్థితి. ప్రగతిభవన్ కు ఎవరు రావాలి? ఎవరు రాకూడదన్న విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఉంటాయని చెబుతారు. ఎవరైనా సామాన్యుడు సీఎంను కలవటానికి వస్తే.. ఆయన దర్శన భాగ్యం అసాధ్యం. గతంలో దివంగత మహానేత వైఎస్ సీఎంగా ఉన్న వేళ.. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సామాన్యులు సీఎంను నేరుగా కలిసేందుకు వీలుగా జనతా దర్బార్ నిర్వహించేవారు.

వారి సమస్యల కోసం కనీసం గంట పాటు సమయాన్ని కేటాయించేవారు. సమస్యలు చెబుతుంటే.. ఓపిగ్గా విని వాటి పరిష్కారం కోసం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా అధికారులతో నేరుగా మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక.. సీఎం కేసీఆర్ కు అలాంటి వాటి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ మాటకు వస్తే.. ప్రగతిభవన్ కు అధికార పార్టీకి చెందిన వారికి సైతం ఎంట్రీ ఉండదని చెబుతారు. ముఖ్యమంత్రిని కలవాలంటే.. దానికో పెద్ద ప్రోసీజర్ ఉంటుందని చెబుతారు.

అలాంటి ప్రగతిభవన్ లోకి గళ్ల లుంగీ కట్టుకొని.. మాసిన గడ్డంతో ఉన్న ఒక బక్కరైతు ప్రగతిభవన్ కు రావటం.. ఆయన పేరు విన్నంతనే.. ఆయనకు లోపలకు ఎంట్రీ  లభించటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. అతగాడు తన కుమార్తెను వెంటపెట్టుకొని సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇంతకీ అతగాడు ఎవరు? ఎందుకు వెళ్లారన్న విషయంలోకి వెళితే.. తెలంగాణ ఉద్యమ కాలానికి వెళ్లాలి. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు రాయపర్తి పర్యటనకు వచ్చినప్పుడు.. ఫణికర మల్లయ్య అనే రైతును.. నీకేం కావాలని అడిగితే.. ‘‘నాకేమీ వద్దు. మా తెలంగాణ మాకియ్యుర్రి.. తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతై’’ అంటూ వ్యాఖ్యానించటం.. అదో సంచలనంగా మారటం తెలిసిందే.

అలా ఫేమస్ అయిన సామాన్యుడు మల్లయ్య.. కుమార్తె వివాహం త్వరలో జరగనుంది. తన కుమార్తె పెండ్లి పత్రికను ఇచ్చేందుకు ప్రగతిభవన్ కు రాగా.. ఆయన్ను లోపలకు అనుమతించారు. నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసి.. శుభలేఖను ఆయన చేతికి ఇచ్చి.. పెళ్లికి రావాలని కోరారు. కొందరి విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరించే తీరు ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News