మోడీకి సెగ పుట్టేలా పవన్ తాజా ట్వీట్

Update: 2017-01-22 17:41 GMT
తరచూ ఏదో అంశంపై ట్విట్టర్ లో ట్వీట్ తో ఏపీ సర్కారును ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా సంచలన పిలుపునిచ్చారు. ట్విట్టర్ ద్వారా ఈ మధ్యహ్నాం (ఆదివారం) పోలవరం మీద వరుస ట్వీట్లు చేసిన ఆయన.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం వినూత్నంగా స్పందించారు. జల్లికట్టుపై పక్కనున్నతమిళనాడులో అక్కడి యూత్ మెరీనా బీచ్ దగ్గర చేసిన శాంతియుత నిరసన మాదిరి కార్యక్రమానికి పవన్ తాజాగా పిలుపునివ్వటం గమనార్హం.

సోషల్ మీడియాతో జరిగిన ప్రచారంతో కేవలం 200 మంది మెరీనా బీచ్ దగ్గర మొదలెట్టిన నిరసన ఎంత పెద్దదిగా సాగి.. చివరకు కేంద్రం ఈ అంశంపై హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత ఈ నెల 26న వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సైలెంట్ ప్రొటెస్ట్ (నిశ్శబ్ద నిరసన)కు ప్లాన్ చేసుకున్న పక్షంలో జనసేన వారికి మద్దతు ఇస్తుందన్న విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు.

పవన్ ట్వీట్ ను చూసినప్పుడు.. పార్టీలకు అతీతంగా యువత చేస్తున్న ఉద్యమంగా దీన్ని ఆయన పేర్కొన్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి మరింత బలాన్ని తీసుకురావటంతో పాటు.. హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోడీ లాంటోళ్లకు జర్క్ ఇచ్చే దిశగా వేసిన కీలకమైన తొలి అడుగ్గా తాజా ట్వీట్ ను చెప్పొచ్చన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. నేరపూరిత రాజకీయాలు.. అవకాశ వాదం మీద నిరసన వ్యక్తం చేసేందుకు వీలుగా.. ఒక మ్యూజిక్ ఆల్బంను తాను తీసుకురావాలని ప్లాన్ చేశానని.. అందుకు ఫ్రిబవరి 5న బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పిన పవన్.. తాజాగా ఆ అల్బంను ఈ నెల 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. చూస్తుంటే.. పవన్ కల్యాణ్ తన వరుస ట్వీట్లతో.. తనదైన నిర్ణయాలతో ప్రభుత్వాల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News