ఆర్టీసీ సమ్మెపై పీకే స్పందన ఏంటంటే?

Update: 2019-10-13 16:53 GMT
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు గడచిన 9 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మె పై దాదాపుగా అన్ని వర్గాల వారూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ శుభం కార్డు వేయాలని పవన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ లో సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ కేసీఆర్ ను కోరడంతో పాటుగా పవన్ కల్యాణ్ ఒకింత ఆసక్తికరమైన అంశాలను కూడా ప్రస్తావించారు. సమ్మె నేపథ్యంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేసి ఆదివారం కన్నుమూసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఉదంతాన్ని కూడా పవన్ ప్రస్తావించారు.

సమ్మె నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం తనను చాలా బాధించిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని సదరు ట్వీట్ లో పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యోదంతానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని పరోక్షంగా చెప్పుకొచ్చిన పవన్... డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఆత్మహత్యకు తెగించే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ లెక్కన శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు కేసీఆర్ సర్కారు వైఖరే కారణమని పవన్ చెప్పినట్టైందన్న వాదన వినిపిస్తోంది.

తన ట్వీట్ లో శ్రీనివాసరెడ్డి ఏ రీతిన ఆత్మహత్య చేసుకున్నారు? ఒంటిపై కిరోసిన్ పోసుకుని శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న వైనం, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? శ్రీనివాసరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటి? నష్టపరిహారం అయితే ఇస్తారు గానీ... ఆయన కుటుంబానికి పెద్ద దిక్కును ఇవ్వలేరు కదా... అంటూ పవన్ తనదైన శైలి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వరంగల్ జిల్లా నరసన్నపేట ఆర్టీసీ డిపోలోనూ ఆదివారం కొందరు కార్మికులు ఆత్మహత్యాయత్నం చేసిన వైనాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్పిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందంటూ పవన్ తన ట్వీట్ లో అభిప్రాయపడ్డారు. మొత్తంగా కర్ర విరగకుండా, పాము చావకుండా... అన్న రీతిన సాగిన పవన్ ట్వీట్ పై అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైపోయింది.

   
   
   

Tags:    

Similar News