వైసీపీకి కమ్మోరు వర్గశతృవా ?

Update: 2021-09-30 10:30 GMT
వైసీపీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరికీ తెలీని రహస్యాన్ని బయటపెట్టారు. ఇంతకీ అదేమిటయ్యా అంటే వైసీపీకి వర్గశతృవు కమ్మోరట. మరి ఏ ప్రాతిపదికన ఈ విషయాన్ని పవన్ చెప్పారో ఆయనకే తెలియాలి. మళ్ళీ జనసేనకు అన్యాయం చేసేవాళ్ళు, దాష్టీకం, ధౌర్జన్యం చేసేవాళ్ళే వర్గశతృవులట. టీఆర్ఎస్ కు పేదరికమే వర్గశతృవుని క్లారిటి ఇవ్వటమే విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్, జనసేనకు మాత్రం దాష్టీకం, ధౌర్జన్యాలు, దోపిడీ, పేదరికమే వర్గశతృవులని తేల్చేసిన పవన్ వైసీపీకి మాత్రం కమ్మోరే వర్గశతృవులని ఏ విధంగా డిసైడ్ చేశారో తానే చెప్పాలి. రాజకీయంగా చంద్రబాబునాయుడుతో జగన్ కు వైరం ఉందే కానీ హోలుమొత్తం మీద కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్లు పవన్ కు ఎవరు చెప్పారో ?

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన నేతల విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడారు. తన సహజధోరణిలోనే నొటికేదొస్తే అది మాట్లాడారు. దాదాపు 2 గంటలపాటు మాట్లాడిన పవన్ ఒక అంశానికి మరో అంశానికి సంబంధంలేకుండా చాలా విషయాలే మాట్లాడేశారు. ఏపీ పాలకుల పొరబాట్ల వల్లే ప్రత్యేక తెలంగాణా వాదన మొదలైందన్నారు. చిన్నప్పటి నుండి తాను పడిన కష్టాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డిని పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వైసీపీ నేతలను సన్నాసులని, వెధవలని, గాడిదలంటు ఏదేదో మాట్లాడారు.
Read more!

రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి తాను బూతులు మాట్లాడటం లేదన్నారు. అయితే బాపట్లలో పెరిగిన తనకు బూతులు రావా అంటు జనసైనికులను ప్రశ్నించారు. తనను తిడితే భయపడతాను అనుకుంటే పొరబడినట్లే అన్నారు. తనని తిట్టేకొద్దీ తాను తిరగబడతానన్న విషయం వైసీపీ నేతలు తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రమంటే ఇడుపులసాయ ఎస్టేట్ కాదన్న విషయం అర్ధం చేసుకోవాలని జగన్ పేరు ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు.

సినిమాల్లోకి ఇష్టంలేకుండానే ప్రవేశించినట్లు చెప్పారు. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టపడే వచ్చినట్లు చెప్పారు. వైసీపీకి వర్గశతృవైన కమ్మోరితో గొడవల కారణంగా రాష్ట్రం తగలబడిపోతున్నట్లు తెగ బాధపడిపోయారు. తనను రాబోయే ఎనికల్లో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. ఆడబిడ్డలవైపు ఎవరనా కన్నెత్తి చూస్తే ఏమవుతుందో చేసి చూపిస్తానని చెప్పారు. తన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తానన్నారు. అందుకనే అనేకపార్టీలతో పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పారు.

అమరావతిని ఇక్కడే ఉంచుతానని చెప్పినందుకు, ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని రూపుమాపేందుకే బీజేపీతో కలిసినట్లు చెప్పారు. స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా తాను వెనక్కు తగ్గలేదన్నారు. ప్రత్యేకహోదా పోరాటం విషయంలో ప్రజలే తన కాళ్లకు బంధం వేసినట్లు చెప్పారు. తనను వైజాగ్ లో గెలిపించుంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో పోరాటం చేసుండే వాడని అన్నారు. అంటే తనను ఓడించి జనాలు తప్పు చేసినట్లు పవన్ తేల్చేశారు.

పవన్ స్పీచ్ లో కొసమెరుపు ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పటం. వైసీపీకి ఇపుడున్న 151 సీట్లు 15కి పడిపోతాయన్నారు. అప్సుడు ఒక్కోళ్ళ కత చూస్తానన్నారు. పాండవుల పాలన ఎలాగుంటుందో అప్పుడు చూపిస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తంమీద పవన్ అసలు ఏమి చెప్పదలచుకున్నారు ? ఏమి చెప్పారనే విషయంలో అభిమానులకైనా క్లారిటి ఉందో లేదో తెలీదు.


Tags:    

Similar News