ఆ మూడు సీట్ల మీద కన్నేసిన పవన్...?

Update: 2022-09-24 10:00 GMT
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల మీద తనదైన రాజకీయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చాప కింద నీరుగా జనసేన పొలిటికల్ వర్క్ చకచకా సాగిపోతోంది. పోటీ చేయాల్సిన సీట్ల మీద స్పష్టమైన అవగాహన‌ జనసేనకు ఉంది అంటున్నారు. అదే విధంగా టీడీపీతో పొత్తు పెట్టుకునే బరిలోకి దిగబోతున్నారు అని తెలుస్తోంది. దాంతో ఎక్కడ టీడీపీ వీక్ గా ఉందో ఎక్కడ తాము బలంగా  ఉన్నామో కూడా లెక్కలేసుకునే పనిలో పవన్ ఉన్నారని చెబుతున్నారు.

ఇక చూస్తే 2019 ఎన్నికల్లో ఎంపీ సీట్లకు ఎమ్మెల్యేకూ పెద్ద ఎత్తున పోటీ పెట్టినా ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే జనసేనకు దక్కింది. కానీ ఈసారి భారీగా ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లు కూడా కొన్ని గెలుచుకోవడానికి జనసేన స్కెచ్ గీస్తోంది. ముఖ్యంగా తనకు పట్టున్నవిశాఖ‌ గోదావరి జిల్లాలో ఉన్న  ఎంపీ సీట్లలో మూడింటి  మీద గట్టిగానే గురి పెట్టినట్లుగా చెబుతున్నారు.

ఈ సీట్లలో పక్కాగా పోటీకి దిగి గెలుచుకోవాలని జనసేన‌ వ్యూహరచన చేస్తోందిట. అందులో విశాఖతో పాటు  రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఉంది. అలాగే నర్సాపురం సీటు ఉంది. ఈ మూడు  సీట్లలో క్యాండిడేట్ల విషయంలో కూడా జనసేన డిసైడ్ అయింది అని తెలుస్తోంది. ముందుగా నర్సాపురం తీసుకుంటే మరోసారి మెగా బ్రదర్ నాగబాబు అక్కడ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.నాగబాబు 2019 ఎన్నికల్లోనే పోటీ చేసి పెద్ద ఎత్తున ఓట్లను కొల్లగొట్టారు.

ఈసారి తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది కాబట్టి కచ్చితంగా నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎంపీ కావడం ఖాయమని జనసేన వర్గాలు అంటున్నారు. తొంబై తొమ్మిది శాతం నాగబాబే ఇక్కడ బరిలో ఉంటారని అంటున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే మాత్రం లోకల్ గా బలంగా ఉన్న ఒక కీలక నేతను పోటీకి పెట్టాలనుకుంటున్నారుట.

ఇక రాజమహేంద్రవరం ఎంపీ సీటుకు టీ టైం అధినేత మురళి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన గోదావరి జిల్లాలకు చెందిన వారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద  ఎత్తున టీ స్టాల్స్ స్థాపించి అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న వారు. యువకుడు కూడా అయినందువల్ల ఆయన పేరునే జనసేన ప్రకటించే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇక రాజమండ్రీలో టీడీపీకి సరైన ఎంపీ క్యాండిడేట్ లేరని అంటున్నారు.

ఇక్కడ 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మురళీమోహన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన కోడలు మాగంటి రూప 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత నుంచి ఆమె రాజకీయాలలో చురుకుగా లేరు. దాంతో పాటు ఇక్కడ అనేక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా టీడీపీకి ఎంపీ క్యాండిడేట్లు దొరకడంలేదు అంటున్నారు.

దాంతో జనసేనకు ఈ సీటుకు వదిలేయడానికి టీడీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. జనసేన సొంతంగా 2019 ఎన్నికల్లో ఆకులసత్యనారాయణ పోటీ చేస్తే లక్షన్నరకు పై చిలులు ఓట్లు వచ్చాయి. టీడీపీకి ఇక్కడ నాలుగు లక్షల అరవై వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అందువల్ల ఈ రెండు పార్టీలు కలిస్తే కచ్చితంగా ఈ సీటు జనసేనకు దక్కుతుంది అన్న లెక్కలు ఉన్నాయి.
4

ఇక విశాఖ ఎంపీ సీటు విషయం తీసుకుంటే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు 2,88,874 ఓట్లు లభించాయి. ఒక విధంగా ఆయన టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక టీడీపీ తరఫున పోటీ చేస్న  శ్రీభరత్ కి 4,32,492 ఓట్లు దక్కాయి. వైసీపీ కేవలం 4,414 ఓట్లతో బయటపడింది. జనసేన టీడీపీ ఇక్కడ కలిస్తే బంపర్ మెజారిటీతో ఈ సీటు ఆ కూటమి పరం అవుతుంది. అయితే ఈ సీటుని జనసేన కోరుతోంది అంటున్నారు.

ఇక్కడ కూడా టీడీపీకి అభ్యర్ధులు ఉన్నా పోటీ చేస్తామని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. అలా ఈ సీటు తమకు ఖాయమైన గెలుపుగా జనసేన తన ఖాతాలో వేసుకుంటోంది అని అంటున్నారు. దాంతో ఈ మూడు ఎంపీ సీట్ల మీద పవన్ దృష్టి పెట్టారని అంటున్నారు. కేవలం ఎమ్మెల్యెలతోనే కాదు, ఎంపీ సీట్లు కూడా ఉంటేనే ఢిల్లీ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించగలమని పవన్ భావిస్తున్నారు అని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News