ఆ మీడియా సంస్థలపై పవన్ గుర్రు

Update: 2016-12-04 07:01 GMT
మీడియాలో తన గురించి వచ్చే వార్తల గురించి పెద్దగా పట్టించుకోని ముఖ్యుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరిగా చెబుతుంటారు. మిగిలిన టాప్ హీరోలకు భిన్నంగా.. మీడియా విషయంలో పవన్ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. ఆయన్ను మీడియా పట్టించుకున్నంత బాగా.. మీడియాను ఆయన పట్టించుకోరన్న మాటను పలువురు మీడియా ప్రతినిధులు తరచూ ఆరోపిస్తుంటారు. అయితే.. తన గురించి చెప్పుకోవటానికి పవన్ కి పెద్ద ఆసక్తి లేకపోవటంతో పాటు.. ఫోకస్డ్ ప్రచారానికి ఆయన దూరమన్నట్లుగా ఉంటారు. సినిమా నటుడిగా ఉంటే ఇలాంటివి పెద్దగా ప్రభావితం చేయకున్నా.. రాజకీయ నాయకుడిగా మాత్రం ఇలాంటివి ఇబ్బందే.

ఈ విషయాన్ని గుర్తించిన పవన్.. ఈ మధ్య కాలంలో తాను ప్రారంభించిన జనసేన పార్టీ విషయంలో పవన్ తన తీరును కాస్త మార్చుకున్నట్లుగా చెబుతారు. కొందరు మీడియా ప్రముఖులతో టచ్ లో ఉండటం లాంటి చేస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి వరకూ తన వార్తలకు వివిధ మీడియా సంస్థల్లో ఇచ్చే ప్రాధాన్యతల గురించి పెద్దగా పట్టని పవన్.. ఇప్పుడు మాత్రం ఆ విషయంలో కాస్త దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

తాను చేస్తున్న వ్యాఖ్యలు.. తాను ఇస్తున్న సందేశం ప్రజలకు ఏలా వెళుతోంది..? ఏ మీడియా సంస్థ.. తనమాటల్ని ఎలా చెబుతోంది? లాంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తెలుగు మీడియాకు చెందిన కీలకమైన కొన్ని మీడియా సంస్థల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం.ప్రత్యేక హోదా సాధన కోసం తాను ఉద్యమాన్ని షురూ చేసినట్లుగా చెప్పిన పవన్ కు.. కొన్ని మీడియా సంస్థలు తోడ్పాటు అందించటం లేదన్న మాట వినిపిస్తోంది.

తిరుపతి సభకు భారీ ప్రాధాన్యత ఇచ్చిన మీడియా.. ఆ తర్వాత జరిగిన రాజమండ్రి.. అనంతపురం సభల విషయంలో మాత్రం ప్రయారిటీ తగ్గించిన విషయాన్ని పవన్ ‘‘నోట్’’ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ ఏం మాట్లాడుతున్నారన్న విషయంపై ప్రజల్లో ఆసక్తి ఉన్నప్పటికీ.. దాన్ని ప్రజలకు చేరవేసే విషయంలో కొన్ని మీడియా సంస్థలు ‘‘ప్లే’’ చేస్తున్న పాత్రపై పవన్ ఫీల్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. లక్షలాదిగా వస్తున్న జనాలకు భిన్నంగా.. తన సభల్ని తక్కువ చేసి చూపేలా వార్తల్ని ఇస్తున్న వైనంపై ఏం చేయాలన్న సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. మీడియా గురించి.. మీడియాలో తన గురించి వచ్చే వార్తల్ని లైట్ తీసుకున్నట్లుగా వ్యవహరించిన పవన్.. ఈ రోజు అదే మీడియాలో తన వార్తలకు తగిన ప్రాధాన్యత లభించటం లేదన్నట్లుగా వ్యవహరించటం కాల మహిమగా మాత్రమే చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News