పారిస్‌లో భారీ శబ్దం .. హడలిపోయిన నగరవాసులు!

Update: 2020-09-30 17:30 GMT
ఫ్రాన్స్ రాజధాని పారిస్ ‌లో భారీ శబ్దం నగరవాసులను తీవ్రంగా వణికించింది. పారిస్‌ లోని సగం నగరానికి ఈ శబ్దం వినిపించింది. అంత భారీ శబ్దాన్ని విన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేం భారీ శబ్దాన్ని విన్నాం. మీకేమైనా వినిపించిందా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. భారీ సంఖ్యలో జనం అలాంటి సందేశాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో మరింత ఆందోళన నెలకొంది. పారిస్, ఆ చుట్టుపక్కల జనాలను హడలెత్తించిన భారీ శబ్దంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

అది బాంబు పేలుడు కాదని స్పష్టం చేశారు. మిలటరీ జెట్ నుంచి వచ్చిన సోనిక్ బూమ్ అని తెలిపారు. ‘పారిస్, ఆ చుట్టుపక్కల భారీ శబ్దం వినిపించింది. అయితే, అది పేలుడు కాదు. మిలటరీ జెట్ సౌండ్ బారియర్‌ను బ్రేక్ చేసింది.’ అంటూ పారిస్ పోలీసులు ట్వీట్ చేశారు. భారీ శబ్దం రావడం, సోషల్ మీడియాలో కూడా దీని మీద భారీ ఎత్తున జనం పోస్ట్ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసు ఫోన్ లైన్లు బిజీగా మారిపోయాయి. ప్రజలకు సర్ది చెప్పడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.

ఈ క్రమంలో పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆందోళనచెందవద్దు. ఈ శబ్దం గురించి ఎమర్జెన్సీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అంటూ పిలుపునిచ్చారు. మిలటరీ జెట్ చేసిన భారీ శబ్దానికి భవనాలు కూడా ఊగిపోయాయని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు చెప్పినట్టు స్థానిక న్యూస్ చానల్స్ పేర్కొన్నాయి. భారీ శబ్దాన్ని విన్నట్టు ప్రజలు చెప్పినా కూడా ఎలాంటి పొగను మాత్రం చూడలేదు.
Tags:    

Similar News