పాక్ అమ్మాయి మన దగ్గర సర్పంచ్ గా ఎన్నికైంది

Update: 2020-01-18 05:32 GMT
మీరు చదివింది నిజమే. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి భారత్ వచ్చింది. తాజాగా ఎన్నికల్లో పోటీ చేయటమే కాదు.. సర్పంచ్ గా ఎన్నికైన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం.. ఎన్సార్సీపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. పాక్ లో పుట్టి పెరిగిన ఒక మహిళ భారత్ లోని ఒక గ్రామానికి సర్పంచ్ గా ఎన్నిక కావటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? పాక్ లో  ఎక్కడ ఉండేవారు? భారత్ కు ఎప్పుడొచ్చారు? ఓటుహక్కు ఎప్పుడు వచ్చింది? ఇంతకూ సర్పంచ్ గా గెలిచింది ఎక్కడ? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

పాక్ లోని సింధ్ ప్రాంతంలో పుట్టారు నీతా కన్వార్. అక్కడే పుట్టి పెరిగిన ఆమె.. పద్దెనిమిదేళ్ల క్రితం భారత్ కు వచ్చారు. రాజస్థాన్ లోని టోంక్  ప్రాంతంలో ఆమె ఉంటున్నారు. భారత్ కు వలస వచ్చి స్థిరపడిన ఆమె.. భారత పౌరసత్వం కోసం గడిచిని ఎనిమిదేళ్లుగా పోరాడుతుంటే.. గత సెప్టెంబరులో ఆమెకు పౌరసత్వం లభించింది.

తనకు ఓటుహక్కు వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే ఆమె రాజస్థాన్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేశారు. టోంక్ జిల్లా నట్వారా గ్రామ పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా ఆమె ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సోనాదేవిపై ఏకంగా 400 ఓట్ల పైచిలుకు మెజార్టీతో ఆమె విజయాన్ని సొంతం చేసుకన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఓటుహక్కు వచ్చిన తర్వాత తొలిసారి దాన్ని వినియోగించటమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికై సంచలనంగా మారారు.

మరో విషయం ఏమంటే నీతా తండ్రి.. సోదరుడు ఇప్పటికి పాకిస్తాన్ లో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించిన సంగతి తెలిసిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇంతకీ నీతా భారత్ ఎందుకు వచ్చిందన్నది చూస్తే.. సింద్ లో ఇంటర్ వరకూ చదివిన ఆమె.. ఉన్నత విద్య కోసం భారత్ కు వచ్చింది. ఇక్కడే స్థిరపడింది. భారత్ కు చెందిన వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తుండగా ఎట్టకేలకు ఆమెకు నాలుగు నెలల క్రితమే ఆమె భారతీయురాలిగా పౌరసత్వం లభించింది. ప్రస్తుతం భారత్ లో నీతా తల్లి.. సోదరి ఉంటున్నారు. 
Tags:    

Similar News