5 జిల్లాల్లో ఆక్సిజన్ కొరత

Update: 2021-04-23 06:43 GMT
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి యావత్ దేశాన్ని వణికించేస్తోంది. అసలు సమస్యకన్నా కొసరు సమస్యే ఎక్కువగా ఉందనేది సామెత. సామెతలో చెప్పినట్లే కరోనా వైరస్ సమస్య కన్నా ఆక్సిజన్ అందకపోవటమే అతిపెద్ద సమస్యగా తయారైంది. కరోనా వైరస్ తో మరణించే రోగుల సంఖ్యకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిసంఖ్యే ఎక్కువైపోతోంది.

దేశమంతా ఆక్సిజన్ కొరత పరిస్దితి దాదాపు ఒకేలాగుంది. ఇప్పటికిప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచలేరు. ఇదే సమయంలో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ సరఫరా కూడా అంత ఈజీకాదు. దాంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత రోగులను పట్టిపీడిస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల పరిస్ధితి ఎలాగున్నా మన రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ కొరత వల్ల సమస్యలు రోజురోజుకు ఎక్కువైపోతోంది.

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటన ప్రకారమే మన రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆక్సిజన్ కొరతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు విశాఖ ఉక్కు ప్యాక్టరీలో ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ లో 50 శాతం రాష్ట్రంలోనే ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు.

విశాఖ స్టీల్స్ నుండి 50 శాతం ఆక్సిజన్ తీసుకోవటమే కాకుండా ఎల్లెన్ బెర్రీ, లికినాక్స్ సంస్ధల్లో ఉత్పత్తయ్యే మొత్తం ఆక్సిజన్ను రాష్ట్రంలోనే ఉపయోగిస్తున్నారట. అయితే ఇపుడు అందుతున్న ఆక్సిజన్ నిల్వలు అవసరాలకు సరిపోవటంలేదు. దాంతో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచటానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. కర్నాటకలోని బళ్ళారి నుండి 68 టన్నుల ఆక్సిజన్ అందితే రాయలసీమ జిల్లాల అవసరాలు తీరుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
Tags:    

Similar News