ఏలూరులో ఎందుకలా? తొలి రెండు రోజులు అలా.. తాజాగా కొత్త లక్షణాలు

Update: 2020-12-08 03:51 GMT
ఏపీలోని ఏలూరులో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. అర్థం కాని అనారోగ్యానికి గురవుతున్న వైనం ఇప్పుడు పీటముడిలా మారింది. అదే సమయంలో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వెలుగు చూస్తున్న కేసుల్ని చూస్తే.. 500 వరకు ఉన్నాయి. అప్పటివరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా మూర్ఛకు గురి కావటం.. వాంతులు.. విరోచనాలకు గురవుతున్న తీరు ఇప్పుడు భయాందోళనలకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పటికే కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనూహ్య అనారోగ్యానికి కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

శనివారం సాయంత్రం నుంచి మొదలైన ఈ వింత అనారోగ్యానికి కారణం ఏమై ఉంటుందన్న విషయాన్ని వెతికేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. కారణం ఏమై ఉంటుందన్నది ఇంకా తేల్లేదు. ఇదిలా ఉంటే.. సోమవారం కొందరి అనారోగ్య లక్షణాలు భిన్నంగా ఉంటున్నాయి. తొలుత ఆసుపత్రిలో చేరి.. కోలుకున్న తర్వాత డిశ్చార్జి అయి ఇంటికి వెళుతున్నారు. వారిలో కొందరు.. మళ్లీ అలాంటి లక్షణాలతో ఆసుపత్రికి రావటంతో వైద్యులకు పాలుపోని పరిస్థితి. ఇప్పటికే ముగ్గురు కోలుకొని ఇంటికి వెళ్లి.. మళ్లీ కొన్ని గంటల తర్వాత మూర్ఛ వచ్చి పడిపోతున్నారు. దీంతో.. వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం చేస్తున్నారు.

శని.. ఆదివారాల్లో నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి వాంతులు.. నోటి నుంచి నురగ లాంటివి రాలేదు. సోమవారం నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి వాంతులు.. విరేచనాలు.. నురగలు కక్కటం.. మూర్ఛ తదితర లక్షణాలతో బాధ పడ్డారు. మూర్ఛతో పడిపోయినప్పుడు.. ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు కొందరి నోటి నుంచి రక్తం రావటం గమనార్హం. మొదటి రెండు రోజులు లేని ఈ కొత్త లక్షణం ఇప్పుడు పలువురిని టెన్షన్ కు గురి చేస్తోంది.

కొందరు బాధితులకు అంబులెన్సులు ఆలస్యంగా రావటంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరుతున్నారు. వారికి సెలైన్ పెట్టి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. బాధితులకు తలనొప్పి.. నడుంనొప్పి.. తల తిరగటం.. గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. నీటికాలుష్యం వల్లనపే ఇలా జరిగిందన్న  ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అధికారులు మాత్రం ఫలానా కారణం వల్ల ఇలా జరుగుతుందన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. మొదటి రెండు రోజుల లక్షణాలతో పోల్చినప్పుడు.. మూడో రోజుకుకొత్త మార్పులు ఎందుకు వస్తున్నట్లు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News