వైద్యానికి డబ్బులేక నోబెల్ విజేత మృతి

Update: 2015-10-13 10:55 GMT
    నోబెల్ బహుమతి అందుకున్న ఆ శాస్త్రవేత్త వైద్యం చేయించుకోలేక ప్రాణాలొదిలారు. ప్రయివేటు ఆసుపత్రులు అడిగినంత డబ్బివ్వలేకపోయిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రసాయన శాస్త్ర పరిశోధనలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి అందుకున్న ఆ శాస్త్రవేత్త దిక్కూమొక్కూలేకుండా ప్రాణాలు వదిలారు.

ఫిలిప్పీన్స్ కు చెందిన రిచర్డ్ హెక్ (84) 2010లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనిలాలో ఆయన భార్య సొకారో హెక్ తో కలిసి జీవించేవారు... ఆ దంపతులకు పిల్లల్లేరు. 2012లో భార్య సొకారో హెక్ మరణించడంతో ఆయన ఒంటరయ్యారు. అప్పటి నుంచి రిచర్డ్ హెక్ బాగోగులను ఆయన మేనల్లుడు చూసుకుంటున్నారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హెక్ కు పెన్షనే ఆధారం. ఆ కొద్దిపాటి పెన్షన్ తోనే హెక్ చికిత్స చేయించుకునేవారు. అయితే చికిత్సకు ఆ డబ్బు సరిపోయేదికాదు.

ఇటీవల ఆయనకు వాంతులు కావడంతో మనీలాలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బిల్లులు చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయకుండా పంపించేశారు. దీంతో రిచర్డ్ హెక్ ను మనిలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల్లోనే ప్రధాన అవయవాలన్నీ పని చెయ్యడం మానేయ్యడంతో రిచర్డ్ హెక్ మరణించారు. హెక్ దయనీయ పరిస్థితి తెలిసుంటే తామంతా అండగా నిలిచి ఆ గొప్ప శాస్త్రవేత్తను బతికించుకునేవారమని పలువురు సైంటిస్టులు అంటున్నారు... అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Tags:    

Similar News