హైద‌రాబాద్ ఖాళీ.. ఏమైంద‌బ్బా!

Update: 2017-09-27 10:29 GMT
దేశమంతా ద‌స‌రా ఉత్స‌వాల్లో మునిగిపోతే.. భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్ మాత్రం.. ముఖం ముడుచుకుని దుప్ప‌ట్లో దాచుకున్న‌ట్టుగా చిన్న‌బోయింది!  మొత్తం మొత్తంగా హైద‌రాబాద్ ఖాళీ అయిపోయింది. కూక‌ట్‌  పల్లి నుంచి ఎంజీబీఎస్ దాకా అటు పాతన‌గ‌రం నుంచి ఇటు ఖైర‌తాబాద్ దాకా నిత్యం జ‌నాల ర‌ద్దీతో దంచికొట్టే రోడ్లు - ఫ్లైవోవ‌ర్లు..  బుధ‌వారం బోసిపోయాయి. న‌గ‌రం న‌గ‌రం మొత్తం వ‌ల‌స‌పోయిందా? అన్న‌ట్టు కూక‌ట్  పల్లి - ఖైర‌తాబాద్‌ - అమీర్‌ పేట‌ - తార్నాక త‌దిత‌ర ప్రాంతాల్లో ఇళ్ల‌కు తాళాలే తాళాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

దీనికి కార‌ణం వ‌రుస‌ల సెల‌వుల హ‌డావుడే!  హైదరాబాద్ మరోసారి అయిదురోజుల సెలవు తీసుకుంది. దసరా సెల‌వు నేప‌థ్యంలో గురువారం - శుక్ర‌వారం - శ‌నివారంతోపాటు కలిసొచ్చిన ఆదివారం సెలవు(మొహర్రం కూడా) - ఆపైన గాంధీ జయంతి సోమ‌వారం! దీంతో అంద‌రూ త‌ట్టా బుట్టా సర్దుకుని సొంతూళ్లకు చెక్కేశారు. ఇన్నాళ్లూ పంజరంలో బందీగా వున్న పావురాలకు స్వేచ్ఛ వచ్చినట్లు జనాలందరూ నగరం నుంచి ఎగిరిపోయారు. చాలాకాలం నుంచి  ఎదురు చూస్తున్న స్వంతంత్రం ఇప్పుడే వ‌చ్చిందా అన్న‌ట్టు పరుగు లంకించారు. వందలు కాదు, వేలు కాదు.. ఏకంగా 12 లక్షల మంది హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు  వెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు.  

మరోవైపు.. రైల్వే స్టేష‌న్లే - బ‌స్టాండ్లు ఇస‌కేస్తే రాల‌నంత‌గా మారిపోయాయి. ఒకేసారి లక్షలాది మంది దండయాత్ర చేయడంతో.. ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు - ట్రైన్లలో సెపరేట్ బోగీలు ఏర్పాటు చేసింది. రైలు టికెట్ల ధ‌ర‌లు పెర‌గ‌క‌పోయినా.. బ‌స్సు టికెట్ల ధ‌ర‌ల‌ను మాత్రం `చూసి మ‌రీ బాదారు` ఇక‌, హైవేల‌పై సొంత వాహ‌నాల్లో వెళ్లే వారికీ కొద‌వేలేదు. దీంతో హైవేల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. టోల్‌ గేటుల వ‌ద్ద వాహ‌నాలు బారులు తీరాయి. అయితే, వీరంతా ఏపీవైపే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. దాదాపు 5 నుంచి 7 ల‌క్షల మంది తూర్పు - ప‌శ్చిమ గోదావ‌రి - విశాఖ‌ - శ్రీకాకుళం - విజ‌య‌వాడ వాసులేన‌ని అధికార వ‌ర్గాల క‌థ‌నం. సో.. మొత్తానికి తెలంగాణ ఖాళీ!!
Tags:    

Similar News