జగన్ కు నిరాశ : పాదయాత్రకు సంకటం!

Update: 2017-10-23 10:12 GMT
జగన్మోహన్ రెడ్డి ఇంకా తొలి అడుగు వేయలేదు గానీ.. అప్పుడే తొలి విఘ్నం వచ్చేసింది. శుక్రవారం కోర్టు వాయిదాలకు రావాల్సిన అవసరం లేకుండా.. మినహాయింపు ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

జగన్ పాదయాత్ర వలన అసలు విచారణ మొత్తం స్తంభించిపోతుందన్నట్లుగా అధికార పక్షం నానా యాగీ చేసినప్పటికీ.. కోర్టులో విచారణ ఉన్న అంశంపై తీర్పును ప్రభావితం చేసేలా.. వారు అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చివరికి జగన్ కు నిరాశ తప్పలేదు. జగన్ కోరినట్లుగా ఏకంగా ఆరునెలల మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ప్రతివారమూ కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం.

ఈ తీర్పుతో జగన్ శిబిరంలో కొంత నిరాశ నెలకొంది. జగన్మోహన్ రెడ్డి.. సోమవారం ఉదయం నుంచి.. పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం అయ్యారు. నిజానికి ఈరోజుల పార్టీ వైసీఎల్పీ సమావేశం నిర్వహించి.. రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు దిశానిర్దేశం చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమావేశాన్ని వాయిదా వేసి.. సీనియర్లతో మాత్రం ఓ భేటీ పెట్టుకున్నారు.

కోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే.. యాత్ర కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వారు భేటీలో ఉండగానే.. కోర్టు తీర్పు కూడా వచ్చేసింది.

కొంత నిరాశ తప్పకపోయినప్పటికీ.. జగన్ పాదయాత్ర ఇక కొన్ని మార్పుచేర్పులతో సాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. 28న తిరుమలకు వెళ్లి... స్వామివారిని దర్శించుకున్న తర్వాత.. నవంబరు 2వ తేదీనుంచి యధావిధిగా జగన్ పాదయాత్ర సాగుతుంది. పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవాలని జగన్ అనుకున్నారు. దీనికి కోర్టు హాజరీ ఒక అవాంతరంగా మారింది. జగన్ కు ఏ రకంగానూ మినహాయింపు దొరకదని, ఆయన పాదయాత్ర అనేదే.. విచారణ ను జాప్యం చేయడానికి ఒక కుట్ర అని తెలుగుదేశం నాయకులు చాలా వ్యాఖ్యానాలు వినిపించారు. జగన్ తరఫు నుంచి మాత్రం.. విచారణ ఆగాల్సిన అవసరం లేకుండా.. తమ న్యాయవాది ప్రతి వాయిదాకు వస్తారని, తనకు మాత్రమే మినహాయింపు కావాలని , విచారణకు ఇతరత్రా అన్ని రకాలుగా సహకరిస్తాం అని జగన్ పేర్కొన్నారు. అయితే ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ప్రతి శుక్రవారం రావాల్సిందే అంటూ తీర్పు చెప్పింది.
Tags:    

Similar News