కిడ్నాప్ కేసుతో నాకు సంబంధం లేదు - భార్గవ్ రామ్

Update: 2021-02-03 16:55 GMT
బోయిన్ ప‌ల్లి కిడ్నాప్ కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్ రామ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొద‌ట ఈ కేసులో ఏ2గా సుబ్బారెడ్డిని పేర్కొని, ఆ త‌ర్వాత త‌న పేరు చేర్చార‌ని పేర్కొన్నారు.

భూ వివాదం నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ మ‌రికొంద‌రితో క‌లిసి హైద‌రాబాద్‌ బోయిన పల్లిలో ముగ్గురిని కిడ్నాప్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసిన నాటి నుంచి అఖిలప్రియభర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు పోలీసులకు చిక్కకుండా అండ‌ర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. అయితే.. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న భార్గవ్ రామ్ కోసం పోలీస్ బృందాలు విస్తృతంగా గాలించాయి.

ఈ క్ర‌మంలో.. భార్గ‌వ్ రామ్ ముందస్తు బెయిల్ కు ద‌ర‌ఖాస్తు చేశారు. ఈ మేర‌కు ఆయన తరుపు లాయర్లు సికింద్రాబాద్ కోర్టులో సోమ‌వారం పిటిషన్ దాఖ‌లు చేశారు. అధికార పార్టీ అండ‌తో ఏవీ సుబ్బారెడ్డి త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు. మొద‌ట ఈ కేసులో ఏ2గా సుబ్బారెడ్డిని చూపించి, ఆ త్వాత త‌న పేరు చేర్చార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త‌న‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని, త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరారు భార్గ‌వ్‌రామ్‌.
Tags:    

Similar News