స్కూల్ కి వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు.. బిగ్ ట్విస్ట్ ఏమిటంటే..!
కర్ణాటకలోని ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ కు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.;
కర్ణాటకలోని ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ కు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో.. లంచ్ బ్రేక్ కాస్తా పిల్లల సెర్చింగ్ గందరగోళంతో నిండిపోయిందని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన దుండగుడు ఇద్దరు పిల్లల్ని అపహరించుకుపోవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే.. ఊహించని రీతిగా అన్నట్లుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పిల్లలు కిడ్నాపర్ బారినుంచి బయటపడ్డారు. అతడు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అవును.. కర్ణాటకలోని ధారవాడలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి క్లాస్ రూమ్ లోకి రాలేదు. దీంతో.. టీచర్లు, సిబ్బంది వెతకడం ప్రారంభించారు. వీరంతా ఎంత వెతికినా ఆ ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులను ఆరా తీశారు. పిల్లలు ఇళ్లకు కూడా వెళ్లలేదని వారు చెప్పారు. దీంతో.. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించడం మొదలుపెట్టారు.
ఆ దృశ్యాల్లో.. లంచ్ బ్రేక్ సమయంలో ఓ వ్యక్తి స్కూల్ ప్రాంగణంలోకి వచ్చి పిల్లలతో మాట్లాడినట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత పిల్లలిద్దరినీ బైక్ పై ఎక్కించుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. సరిగ్గా ఇక్కడే బిగ్ ట్విస్ట్ నెలకొంది.. ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఇందులో భాగంగా.. దండేలీ ప్రాంతంలో పిల్లలను తీసుకెళ్తున్న బైక్ కు ప్రమాదం జరిగింది. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆరాతీయగా అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో పిల్లలను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ధారవాడ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లల్లో ఒకరికి నిందితుడు తెలుసని, జాతర చూపిస్తానని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.