నీతి ఆయోగ్ : ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది .. మోదీకి జగన్ విన్నపం !

Update: 2021-02-20 09:30 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి సమావేశం వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగుతోన్న సంగతి  తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్  ప‌లు విష‌యాలను ప్ర‌స్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగ‌వంతంగా సాధిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్ర విభ‌జన వ‌ల్ల ఏపీ నష్టపోయిందని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్ప‌ట్లో పార్లమెంట్‌ లో ప్రకటన చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు.

పీఎఫ్‌ సీ, ఆర్‌ ఈసీ రుణాలపై ఏపీ స‌ర్కారు ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తుంద‌ని జ‌గ‌న్ తెలిపారు. అలాగే, రుణాలపై అధిక వడ్డీలతో పాటు విద్యుత్‌ ఖర్చులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి భారంగా మారాయ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ఏపీ స‌ర్కారు స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.  పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించాల‌ని ఆయ‌న చెప్పారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ లో కొత్త  సాంకేతిక‌తను ప‌రిచయం చేయాల‌ని తెలిపారు.

ఇదే సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రాలన్నీ సమన్వయంతో ముందుకు సాగితేనే సమాఖ్య స్పూర్తికి అర్థమని పేర్కొన్నారు. రాష్ట్రాలతో పాటు జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్పూర్తి నెలకొనాలన్నారు. భారత్ ‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దే క్రమంలో ప్రైవేట్ రంగానికి మరింత ఊతమివ్వాలని, ఆ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని అన్నారు. తద్వారా భారత్ స్వయం స్వావలంభన సాధిస్తుందన్నారు. దేశంలో ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. ప్రైవేట్ సెక్టార్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ప్రైవేట్ సెక్టార్ కు మనం సరైన అవకాశాలను అందించాలని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేశాయని, కరోనాను విజయవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ముందు మనం సగర్వంగా నిలిచామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయడంలోనే మన దేశాభివృద్ధి ఉందని అన్నారు. పోటీతత్వం అనేది రాష్ట్రాల మధ్యే కాకుండా, అది జిల్లాలకు కూడా విస్తరించాలని చెప్పారు. గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా సాధించామో, అలాగే ప్రజల సంక్షేమం కోసం ఈజ్ ఆఫ్ లివింగ్ ను సాధించాలని మోదీ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కు వచ్చిన స్పందన చాలా గొప్పగా ఉందని... ఈ స్పందన మన దేశం యొక్క మూడ్ ను తెలుపుతోందని అన్నారు.
Tags:    

Similar News