వైసీపీకి ఆ సీటు బంగారు పళ్ళెంతో ఇస్తున్న టీడీపీ పెద్దాయన

Update: 2023-01-29 11:00 GMT
లక్ అంటే అక్కడ వైసీపీ వారిదే. ఏ శ్రమ పరిశ్రమ లేకుండా హ్యాపీగా గెలిచేయవచ్చు. ఎన్నికలు ఎపుడు వస్తాయి అని చూసుకోవడమే తప్ప రిజల్ట్ తో పని లేదు. అలా బంగారం పళ్ళెంలో పెట్టి మరీ ఆ సీటుని తెలుగుదేశం పెద్దాయన వైసీపీకి అప్పగిస్తున్నారు. ఆ సీటు తూర్పుగోదావరి జిల్లాలోని తుని. తుని సీటు  విషయంలో తెలుగుదేశంలో సాగుతున్న వార్ వైసీపీకి మరోసారి విజయాన్ని కట్టబెట్టేలా ఉందని అంటున్నారు.

తుని ఏమైనా తెలుగుదేశానికి అచ్చి రాని సీటా అంటే ఏమీ కాదు. 1983 నుంచి చూసుకుంటే వరసగా ఆరు సార్లు అదే సీటు నుంచి సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు గెలిచిన సీటు అది. ఆయన అనేకసార్లు మంత్రి పదవులతో పాటు, స్పీకర్ గా కూడా చేశారు 2009లో ఫస్ట్ టైం యనమల రామక్రిష్ణుడు అక్కడ ఓడారు. ఆ తరువాత నుంచి మళ్లీ టీడీపీకి ఆ సీటు దక్కలేదు.

ఓడిన యనమల ఎమ్మెల్సీగా అయ్యారు. గత రెండు పర్యాయాలుగా ఆయన కొనసాగుతున్నారు. తన తమ్ముడు క్రిష్ణుడికి 2014, 2019లలో అక్కడ నుంచి పోటీ చేయిస్తే వైసీపీ తరఫున దాడిశెట్టి రాజా రెండు సార్లూ గెలిచారు. ఇక గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి అయిపోయారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన గెలుపు సునాయాసమవుతోంది. ఇపుడు మంత్రి పదవి చేతిలో ఉంది.

దాని కంటే ముందు చూస్తే యనమల ఫ్యామిలీలో ఉన్న లుకలుకలు ఆయనకు రాచబాట వేస్తున్నాయి అని చెప్పాలి. ఇక రెండు సార్లు వరసబెట్టి ఓడిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. దాంతో యనమల తమ్ముడుకి సీటు రాదని అంటున్నారు. అయినా ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. యనమల రామక్రిష్ణుడు కూడా తక్కువ తినలేదు.

తన కుమార్తెకు టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఆయన కావడంతో బయటకు ఏమీ అనలేకపోతున్నా సర్వేలు చూస్తే వైసీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బలమైన క్యాండిడేట్ ని దింపాలని తెలుగుదేశం ఆలోచిస్తోంది. మరో వైపు చూస్తే యనమల ఫ్యామిలీకి అసలు టికెట్ ఇవ్వవద్దు అని తమ్ముళ్ళు కోరుతున్నారుట.

ఇంకో వైపు చూస్తే మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు చంద్రబాబుని కలసి వచ్చారు అలాగే కాపులకు ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ ఉందిట. ఎవరికి టికెట్ ఇచ్చినా యనమల ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే తమ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారో పెద్దాయన అన్న కంగారు ఉంది. ఇవన్నీ చూస్తూంటే వైసీపీకి ఈ సీటు అప్పగించినట్లే అని అంటున్నారు. మరి అదే నిజమా అంటే చూడాలి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News