ద్రౌపది గెలుపు ఖాయమన్న మమత

Update: 2022-07-02 11:59 GMT
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ ఇప్పటికి వాస్తవాన్ని గ్రహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని ప్రకటించేశారు. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేస్తున్న  యశ్వత్ సిన్హా దక్షిణాది పర్యటనలో ఉండగానే మమత కోల్ కత్తాలో ఈ ప్రకటన చేయటం గమనార్హం. నరేంద్రమోడిని దెబ్బ కొట్టేందుకు రాష్ట్రపతి ఎన్నికను వేదికగా ఉపయోగించుకోవాలని మమత తీవ్రంగానే ప్రయత్నించారు.

నిజానికి ఏ విధంగా కూడా రాష్ట్రపతి ఎన్నికలో నాన్ ఎన్డీయే అభ్యర్ధి గెలుపు సాధ్యంకాదు. ఈ విషయం తెలిసినా కూడా మమత మొండిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మమత ప్రయత్నానికి కొన్నిపార్టీలు సహకరించాయి, కొన్ని సహకరించలేదు. అన్నీపార్టీలు సహకరించినా నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధి గెలుపుకు అవకాశాలు లేవు. మమత మొండిగా చేసిన ప్రయత్నాలు ఇపుడు బెడిసికొడుతున్నాయి.

నాన్ ఎన్డీయే పార్టీల తరపున పోటీలోకి దిగిన యశ్వంత్ వివిధ రాష్ట్రాలు తిరుగుతు గెలుపుకు తన ప్రయత్నాలను తాను చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సిన్హా ఇపుడు హైదరాబాద్ లో క్యాంపేశారు.

ఇదే సమయంలో కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడుతు ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది గెలుపు ఖాయమని ప్రకటించటం సంచలనంగా మారింది. ఒకవైపు సిన్హాను రంగంలోకి దింపి మరోవైపు ద్రౌపది గెలుపు ఖాయమని ప్రకటించటంలో మమత వ్యూహమేమిటో  అర్ధం కావటంలేదు.

పైగా ఎన్డీయే అభ్యర్ధిని నిలబెట్టే ముందు నరేంద్రమోడి ప్రతిపక్షాలను కూడా సంప్రదించుంటే బాగుండేదని ఇపుడు చెబుతున్నారు. సంప్రదించుంటే ఏకాభిప్రాయంతోనే రాష్ట్రపతి ఎంపిక జరిగి ఉండేదన్నారు. తమ అభ్యర్ధి గెలుపుకు అవకాశాలు లేవని తేలిపోయిన తర్వాతే మమత ఇపుడీ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ విషయం ఏమిటంటే యూపీఏలో భాగస్వామి అయిన జేఎంఎం కూడా ద్రౌపదికే మద్దతు ప్రకటించింది. పంజాబ్ లోని అకాలీదళ్ కూడా ద్రౌపదికే మద్దతు ప్రకటించింది. మొత్తానికి నాన్ ఎన్డీయే పార్టీల్లోనే ద్రౌపదికి మద్దతు పెరిగిపోతుండటంతో చేసేదిలేక మమత పై వ్యాఖ్యలు చేసినట్లున్నారు.
Tags:    

Similar News