జగన్ టెన్షన్ పడుతున్నారా... బాబు గుట్టు పట్టేశారా...?

Update: 2022-11-26 02:30 GMT
రాజకీయాల్లో ఎపుడూ   హడావుడి ఉంటుంది. కానీ అది శృతి మించి రాగాన పడితేనే వేరే విధంగా సంకేతాలు వెళ్తాయి. ఇపుడు ఏపీలో అధికార వైసీపీలో అదే జరుగుతోందా అంటే అవును అని జవాబు వస్తోంది. ఒక వైపు ఎన్నడూ లేని విధంగా గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ ఆరేడు నెలల క్రితం జగన్ ఎమ్మెల్యేలను పంపించారు. దాని వల్ల వచ్చిన ఫలితాలు అన్నీ సర్వే నివేదికల ద్వారా ఎప్పటికపుడు వచ్చి చేరుతున్నాయి.

దీంతో సడెన్ గా పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇది పెద్ద కుదుపుగా వైసీపీలో భావిస్తున్నారు. ఇక పార్టీలోని వారు కఠిన చర్యలని, అప్రమత్తం అవుతున్నారని అనుకుంటే విపక్ష శిబిరం మాత్రం ఇది అధికార పార్టీలో కలుగుతున్న ఆందోళనకు నిదర్శనం అంటోంది. ఎక్కడో తేడా కొట్టిందని ఈపాటికి అర్ధమై సర్దుకునే పనిలో వైసీపీ పడింది అని భాష్యం చెబుతోంది.

తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ రాజకీయంగా ఫినిష్ అయ్యేందుకు టైం దగ్గరపడింది అని అన్నారు. ఆ విషయం ఆ పార్టీ పెద్దలకు బాగా అర్ధమైపోయింది అని కూడా చెప్పుకొచ్చారు. తాను ఎక్కడకు వెళ్లినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారని, దాన్ని చూసి అలెర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగుతోందని, పార్టీలో ఒకేసారి ఎనిమిది మంది ప్రెసిడెంట్లను తీసేయడం అందులో భాగమే అని బాబు అంటున్నారు.

ఇపుడు వైసీపీ హై కమాండ్ అర్జంటుగా బీసీ నేతలతో మీటింగ్ పెట్టడం కూడా కలవరంతో చేస్తున్న చర్యలే అని అన్నారు. ఎన్ని చేసినా పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని, ఆ విషయం వైసీపీ హై కమాండ్ కి కూడా తెలుసు అని ఆయన అంటున్నారు. ఎక్కడికి వెళ్లినా వైసీపీ పట్ల పూర్తి నెగిటివిటీ కనిపిస్తోందని, దాంతో చేసేది ఏమీ లేక హడావుడి పడుతోందని ఆయన అంటున్నారు.

మరి చంద్రబాబు విశ్లేషణ చూస్తే వైసీపీ పని అయిపోయింది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా తామే అధికారంలోకి వస్తామని ఆయన చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ వైసీపీలో మాత్రం 175కి 175 అన్న ధీమాను కనబరచడం అంతా ఏమనుకోవాలి. దాన్ని మేకపోతు గాంభీర్యంగా చూడాలా అన్న చర్చ అయితే ఉందిపుడు.

అంతే కాదు వైసీపీ అధినాయకత్వం మొత్తం సీట్లను గెలుచుకోవడానికి ఎక్కడా ఓడిపోకూడదని భావించి మరమ్మత్తులు చేసుకుంటోంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈ తొందర, స్పీడ్ దూకుడు చూస్తూంటే ఏదో జరుగుతోందా అన్న చర్చ అయితే కనిపిస్తోంది. అయితే ఒక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఒకసారి కనుక వ్యతిరేకత మొదలైంతే మాత్రం దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అది శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒకే తీరున ఉధృతంగా సాగుతుంది. అయితే రాజకీయ పార్టీలు అన్నాక కాడె వదిలేది ఉండదు, అందువల్ల చివరి క్షణం వరకూ వారి ప్రయత్నాలలో వారు ఉంటారు. మరి అలా అనుకోవాలా లేక వైసీపీ నూటికి నూరు శాతం గెలిచేందుకు వ్యూహాలుగా చూడాలా. ఏది ఏమైనా వైసీపీలో కొంత తేడా అయితే కనిపిస్తోంది అని అంతా అంటున్న మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News