కశ్మీరీ పెద్దాయన్ను చైనాకు పంపాల్సిన టైమొచ్చిందా?

Update: 2020-09-25 06:45 GMT
ప్రజాస్వామ్య దేశం కావటం మంచిదే. కానీ.. కొందరు నేతల మాటలు విన్నంతనే రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇంతలా బద్నాం అవుతుందన్న విషయాన్ని రాజ్యాంగాన్ని రాసిని పెద్దమనుషులు అస్సలే మాత్రం ఊహించి ఉండరు. లేకుంటే.. ఏదో ఒక పాయింట్ పెట్టి ఉండేవారు. దేశంలో ఉంటూ.. స్వేచ్ఛా ఫలాల్ని అనుభవిస్తూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే నేతల్లో ఒకరు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆయన తీరును పలువురు తప్ప పడుతుంటారు.

అలాంటి ఆయన తాజాగా మరోసారి నోటికి పని చెప్పారు. భారత్ లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామని కశ్మీరీలు భావిస్తున్నారని.. ఆర్టికల్ 370 రద్దును వాళ్లు ఎన్నడూ స్వాగతించలేదన్నారు. ఈ మాటే నిజమనుకుందాం? అదే నిజమైతే.. కశ్మీర్ లోయలో తప్పించి.. జమ్ము.. లఢాఖ్ లో ఎందుకు ఆందోళనలు చోటు చేసుకోవటం లేదు? నిరసనలు ఎందుకు వెల్లువెత్తవు. మరి.. ఆ రెండు ప్రాంతాల్లోని వారు కశ్మీరీలు కాకుండా పోతారా? అన్నది ప్రశ్న.

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని కొద్ది మందికి తప్పించి అత్యధికులకు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నది లేదు. దేశంలో ఒకరిగా భాగస్వామ్యం కావటం మానేసి.. ఇలాంటి అర్థం లేని మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలో జరిగిన పొరపాట్లను వర్తమానంలో సరిదిద్దుకోకపోతే.. భవిష్యత్తు మరింత గందరగోళంగా ఉంటుందన్న విషయం ఫరూక్ లాంటి సీనియర్లకు తెలీని విషయాలా?

కశ్మీర్ లోయలో ఆంక్షలు ఎత్తివస్తే ప్రజలు నిరసనలు చేస్తారని.. పరిస్థితి ఇలానే కొనసాగితే కశ్మీరీలు చైనా పాలనే మేలు అనుకునే ప్రమాదం ఉందన్న మాటలు ఒళ్లు మండేలా చేయటమే కాదు.. అర్జెంట్ గా ఆయన్ను చైనాకు పంపించి కొంతకాలం ఉంచితే బాగుంటుందన్న భావన కలుగక మానదు. తమ దేశం తరఫున పోరాడిన వారు మరణిస్తే.. వీరిని సైనికులుగా కూడా గుర్తించిన దేశంతో భారత్ ను పోల్చటమా? ఫరూక్ ప్రస్తావించిన చైనాలో నోట్లో నుంచి మాట కూడా రాదన్న నిజాన్ని మర్చిపోతే ఎలా? ఇలాంటి మాటలతో ఫరూక్ కశ్మీరీల మనసుల్లో మరింత విషాన్ని నింపుతున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News