బిగ్ బ్రేకింగ్ : ఏపీ లిక్కర్ స్కాంపై సంచలన తీర్పు

దాదాపు ఏడాదిగా రాజ్ కేసిరెడ్డి జైలులో ఉన్నారు. రూ.3,500 కోట్ల విలువైన లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.;

Update: 2026-04-07 09:33 GMT

ఏపీ మద్యం స్కాం కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డికి బెయిలు మంజూరైంది. కేసిరెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరుకు అంగీకరించింది. పోలీసుల విచారణకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించింది. అదేసమయంలో దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది. కేసిరెడ్డి పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది.

దాదాపు ఏడాదిగా రాజ్ కేసిరెడ్డి జైలులో ఉన్నారు. రూ.3,500 కోట్ల విలువైన లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్టు చేసింది. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కేసిరెడ్డి ఉన్నారు. బెయిలు కోసం జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసిరెడ్డి ప్రయత్నించారు. కానీ, ఇప్పటివరకు ఊరట దక్కలేదు. ఇక తాజాగా హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో కేసిరెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సుమారు 40 మందికి పైగా నిందితుల జాబితాలో ఉన్నారు. విపక్షం వైసీపీకి చెందిన కీలక నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మద్యం వ్యాపారులు లిక్కర్ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వ్యాపార సంస్థలు, కంపెనీలను సైతం నిందితుల జాబితాలో చేర్చారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి మద్యం క్రయవిక్రయాలను పర్యవేక్షించారని, డిస్టలరీల నుంచి కమీషన్ వసూలు చేశారని సిట్ ఆరోపిస్తోంది.

ఏపీ సీఐడీతోపాటు ఈడీ కూడా లిక్కర్ స్కాంపై కేసు నమోదు చేసింది. మద్యం సరఫరా చేసే కంపెనీల నుండి నెలకు రూ.50-60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేశారని, ఐదేళ్లలో మొత్తం రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని రాజ్ కేసిరెడ్డితోపాటు ఇతర నిందితులపై సిట్ అభియోగాలు మోపింది. ఇక ఈ కేసులో ఆర్కిటెక్ట్ ఆఫ్ స్కామ్ అంటూ సుప్రీంకోర్టు గతంలో రాజ్ కేసిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆ తర్వాత రాజ్ కేసిరెడ్డికి బెయిలు లభించే అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. అయితే కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోవడం, కొద్ది రోజుల్లో తుది చార్జిషీటు దాఖలు చేస్తామని సిట్ కోర్టుకు చెప్పడంతో రాజ్ కేసిరెడ్డికి బెయిలు ఇచ్చేందుకు కోర్టు సమ్మతించిందని చెబుతున్నారు.

Tags:    

Similar News