బీజేపీ ఇంతలా దిగజారిపోయిందా ?

Update: 2021-02-24 02:30 GMT
నీతులన్నవి చెప్పేటందుకే కానీ తాను ఆచరించేందుకు కాదని వెనకటికొక సినిమాలో ఎవరో చెప్పారు. ప్రస్తుతం బీజేపీ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. పొద్దున లేచిందగ్గర నుండి జనాలకు నీతులు చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడి తాను మాత్రం వాటిని ఆచరించటం లేదు. తాజాగా పశ్చిమబెంగాల్ రాజకీయాలను చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. మమతాబెనర్జీ మీద బీజేపీ అగ్రనేతలకున్న పీకలదాకా కోపాన్ని చివరకు సీఎం మేనల్లుడు, ఆయన భార్య, మరదలుపై సీబీఐ కేసులు పెట్టించే దాకా వెళ్ళింది.

ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో అభిషేక్ కేంద్రమంత్రిపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. కేసును స్వీకరించిన కోర్టు అమిత్ షా కు నోటీసులు పంపింది. దాన్ని అవమానంగా బావించిన అమిత్ వెంటనే అభిషేక్ తో పాటు మరో ఇద్దరిపై వెంటనే సీబీఐని ఉసిగొల్పారు. ఎప్పుడో బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఇపుడు సీబీఐ ముగ్గురికి నోటీసులు జారీచేయటం సంచలనంగా మారింది.

బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ అడ్డమైన పనులు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఏలు, ఎంపిలు+నేతలను బీజేపీలోకి లాగేసుకుంటున్నారు. ఎంత వీలైతే అంతా మమతను దెబ్బ కొట్టాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది కమలంపార్టీ. సరే మమత కూడా ఏదో పద్దతిలో ఎప్పటికప్పుడు బీజేపీకి సవాళ్ళు విసురుతునే ఉన్నారు. దాంతో బెంగాల్ రాజకీయం ఇపుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకవైపు ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయించి వేరే పార్టీలోకి చేరితే మూడు మాసాల్లో వారిపై అనర్హత వేటు పడాలని ఎన్నోసార్లు చెప్పారు. విచిత్రమేమిటంటే రాజ్యసభలోనే టీడీపీ నుండి నలుగురు ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించినా వాళ్ళ అనర్హతపై ఏడాది దాటిపోయినా వెంకయ్య  ఏమీ మాట్లాడటం లేదు. ఇక ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో విలువల గురించి ఎన్ని లెక్షర్లు దంచుతున్నారో అందరు చూస్తున్నదే. బెంగాల్లో మాత్రం ఫిరాయింపులైపోయి చివరకు ప్రత్యర్ధులపై సీబీఐని ఉసిగొల్పుతున్నారు. ఇంకా ఏమేమి చేస్తారో చూద్దాం.
Tags:    

Similar News